Nestle CEO: నెస్లే సీఈవోపై వేటు..సహోద్యోగితో రహస్య ప్రేమాయణమే కారణం

Nestle CEO: నెస్లే సీఈవోపై వేటు..సహోద్యోగితో రహస్య ప్రేమాయణమే కారణం
X
కంపెనీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని వెల్లడి

ప్రపంచ ప్రఖ్యాత ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే సంచలన నిర్ణయం తీసుకుంది. తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) లారెంట్ ఫ్రీక్స్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించింది. తన కింద పనిచేసే ఒక ఉద్యోగితో రహస్యంగా ప్రేమాయణం న‌డిపినందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కంపెనీ స్పష్టం చేసింది. కిట్‌క్యాట్, మ్యాగీ, నెస్కేఫ్ వంటి బ్రాండ్లతో సుపరిచితమైన నెస్లే తీసుకున్న ఈ నిర్ణయం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ ఉదంతంపై కంపెనీ అంతర్గతంగా విచారణ జరిపింది. ఛైర్మన్ పాల్ బల్కే, లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ పాబ్లో ఇస్లా పర్యవేక్షణలో జరిగిన ఈ విచారణ అనంతరం, ఫ్రీక్స్‌ను తొలగించాలని బోర్డు నిర్ణయించింది. కంపెనీ ప్రవర్తనా నియమావళిని (కోడ్ ఆఫ్ బిజినెస్ కండక్ట్) ఆయన ఉల్లంఘించినట్లు తేలిందని నెస్లే ఒక ప్రకటనలో తెలిపింది. "కంపెనీ విలువలు, పాలనా ప్రమాణాలే మాకు పునాది. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి అయింది" అని ఛైర్మన్ పాల్ బల్కే పేర్కొన్నారు.

ఫ్రీక్స్ స్థానంలో కొత్త సీఈఓగా ఫిలిప్ నావ్రాటిల్‌ను నియమిస్తున్నట్లు బోర్డు వెంటనే ప్రకటించింది. ఇప్పటివరకు ఆయన నెస్లే అనుబంధ సంస్థ అయిన నెస్ప్రెస్సో బ్రాండ్‌కు సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కంపెనీ వృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడంలో నావ్రాటిల్ సరైన వ్యక్తి అని బోర్డు విశ్వాసం వ్యక్తం చేసింది. కంపెనీ వ్యూహంలో ఎలాంటి మార్పులు ఉండవని, పనితీరులో వేగం తగ్గదని ఛైర్మన్ స్పష్టం చేశారు.

లారెంట్ ఫ్రీక్స్ 1986లో నెస్లేలో చేరి సుదీర్ఘకాలం పనిచేశారు. అయితే, సీఈఓగా ఆయన బాధ్యతలు చేపట్టింది 2024 సెప్టెంబరులోనే. గత కొంతకాలంగా నెస్లే ఆర్థికంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. గతేడాది కంపెనీ షేరు ధర దాదాపు పావు వంతు పడిపోయింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో లాభాలు కూడా 10.3 శాతం తగ్గాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా ప్రవర్తించడం వల్లే యాజమాన్యం కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంపై స్పందించిన నూతన సీఈఓ ఫిలిప్ నావ్రాటిల్, కంపెనీ వ్యూహాత్మక దిశను తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని, పనితీరును మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Tags

Next Story