Israel: గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు..నెతన్యాహూ ఆదేశాలు..

అమెరికా మధ్యవర్తిత్వంతో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి తూట్లు పడ్డాయి. గాజాపై శక్తిమంతమైన దాడులు చేయాలని మంగళవారం తమ సైన్యాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. వెంటనే రాత్రికల్లా దాడులు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల బాంబుల శబ్దాలు వినిపించాయి. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపిందని, అందుకే ఈ ఆదేశాలిచ్చామని ఆయన వెల్లడించారు.
మరోవైపు ఇజ్రాయెల్ తీరును హమాస్ నిరసించింది. మృతదేహాల అప్పగింతను ఆలస్యం చేస్తామని హెచ్చరించింది. హమాస్ ఇంకా 13 మృతదేహాలను అప్పగించాల్సి ఉంది. హమాస్ సోమవారం రాత్రి అప్పగించిన ఓ బందీ మృత శరీర భాగాలు.. రెండేళ్ల కిందట గాజాలో తమ బలగాలు స్వాధీనం చేసుకున్న మృతుడికి సంబంధించినవని నెతన్యాహు అంతకుముందు ఆరోపించారు. ఇది కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. దీనిపై ఎలా స్పందించాలనే అంశంలో నిర్ణయం తీసుకునేందుకు భద్రతాధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మీడియా తదుపరి అవకాశాలపై కథనాలను ప్రచురించింది. హమాస్ నేతలే లక్ష్యంగా గాజాపై వైమానిక దాడులకు దిగవచ్చని వెల్లడించింది. అన్నట్లుగానే దాడులు ప్రారంభమయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

