South Africa New Variant : దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్..!
South Africa New Variant : దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో వెలుగుచూసిన కొవిడ్ కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. B.1.1.529 రకం వేరియంట్ వ్యాప్తిపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విదేశీ ప్రయాణికుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. ప్రయాణికులకు పకడ్బందీగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. వారికి కొవిడ్ పరీక్షలు కచ్చితంగా చేయాలని సూచించింది.
ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వచ్చే వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అదనపు చీఫ్ సెక్రటరీలు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరికైనా కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయితే వెంటనే వారి శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు పంపాలని సూచించారు.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతో దగ్గరగా మెలిగిన వారిని ట్రాక్ చేసి కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వీసా పరిమితులు తగ్గించడం, అంతర్జాతీయ ప్రయాణంపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఈ వేరియంట్ వ్యాప్తికి అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇటు ఈ కొత్త వేరియంట్ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ కొత్త వేరియంట్‌పై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైంది. ఇప్పటికే 22 కేసులను గుర్తించినట్లు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్‌ను బోట్స్‌వానా, హాంకాంగ్‌ల్లోనూ కనుగొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com