New jersey : గగనతలంలో 2 హెలికాప్టర్లు ఢీ- ఒకరు మృతి

అమెరికాలో రెండు హెలికాప్టర్లు ప్రమాదానికి గురయ్యాయి. ఆదివారం దక్షిణ న్యూజెర్సీలో హెలికాప్టర్లు గాల్లో ఉండగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. అనంతరం రెండు హెలికాప్టర్లు నేలను కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా.. ఇంకో పైలట్ ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నాడు. ఇక ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్ స్ట్రోమ్ F-28A హెలికాప్టర్, ఎన్ స్ట్రోమ్ 280C హెలికాప్టర్‌లు ఢీకొన్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు హెలికాప్టర్లలో ఒక్కొక్క పైలట్లు మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ఈ సంఘటన అట్లాంటిక్ కౌంటీలోని హామోంటన్ విమానాశ్రయం సమీపంలో ఆదివారం ఉదయం 11:25 గంటలకు జరిగినట్లుగా అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
ఇక ప్రమాద విషయం తెలియగానే అత్యవసర బృందాలు సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఇక హెలికాప్టర్ నేలపై కూలిపోయే ముందు గిరగిర తిరుగుతూ కూలిపోయినట్లుగా వీడియోలో కనపించింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వేగంగా సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఒక పైలట్ మృతదేహాన్ని స్వాదీనం చేసుకోగా.. ఇంకొక పైలట్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆకాశం మేఘావృతం అయి ఉంది. ఆ సమయంలో తక్కువ స్థాయిలోనే గాలులు వీస్తున్నాయి. ప్రమాదానికి వాతావరణం అనుకూలించకపోవడమా? మరేదేమైనా కారణం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వాతావరణ డేటాతో పాటు ఎయిర్ ట్రాఫిక్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ రికార్డులను సమీక్షిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

