Russia-North Korea: పరస్పర సహకారానికి రష్యా, ఉత్తరకొరియా ఒప్పందం
ఉత్తర కొరియా- రష్యాల మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ బుధవారం సంతకాలు చేసేశారు. ఇది తమ మధ్య సంబంధాల్లో గొప్ప మైలురాయిగా ఇద్దరు దేశాధినేతలు తెలిపారు. ఇందులో భాగంగా పాశ్చాత్య దేశాల నుంచి తమ రెండు దేశాల్లో ఎవరిపై దాడి జరిగినా పరస్పరం సహరించుకోవాలని నిర్ణయించారు. 24 ఏండ్ల తర్వాత తొలిసారిగా పుతిన్ ఉత్తరకొరియాలో పర్యటించారు
అలాగే, వీటితో పాటు ఆరోగ్యం, వైద్య విద్య, సైన్స్ విభాగాల్లో ఇరు దేశాలు సహాకారం అందించుకునేలా పలు ఒప్పందాలను పుతిన్- కిమ్ జోంగ్ ఉన్ చేసుకున్నారు. పశ్చిమ దేశాలతో ఈ రెండు దేశాలకు ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో తాజా భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. కిమ్ ఆహ్వానం మేరకు ఉత్తర కొరియా పర్యటనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం రాత్రి ఆ దేశ రాజధాని ప్యాంగాంగ్‌కు వెళ్లారు. ఉత్తర కొరియా పర్యటన ముగిసిన తర్వాత వియత్నాంకు పుతిని తిరుగుపయనం అయ్యారు.
ఇక, వ్లాదిమిర్ పుతిన్ తన ఉత్తర కొరియా పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు కిమ్‌కు తమ దేశంలో అత్యంత విలాసవంతమైన ఆరస్ లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ సందర్భంగా కిమ్ కూడా పుతిన్‌కు పలు విలువైన బహుమతులను అందజేశారు. గత ఫిబ్రవరిలో కిమ్ మాస్కో పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి కారునే పుతిన్ ఆయనకు బహుమతిగా ఇచ్చాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com