Obesity Medicine: శుభవార్త! లావు తగ్గడానికి మందు వచ్చేసిందోచ్! అమెరికా అనుమతిచ్చిన తొలి ఔషధం ఇదే..

Obesity Medicine: ఒబెసిటీ, ఊబకాయం.. చాలా చిన్న వయసు నుండే చాలామందిని పీడిస్తున్న ఆరోగ్య సమస్య ఇది. ఔషదం లేని చాలా ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం కూడా ఒకటి. ఆహార అలవాట్లతో ఊబకాయాన్ని కంట్రోల్ చేయొచ్చని వైద్యులు చెప్పినా.. అదంతా ఈజీ కాదని ఊబకాయం బారిన పడినవారి వాదన. అయితే ఫార్మసీ వరల్డ్ కూడా ఎంతో అడ్వాన్స్‌డ్‌గా ఆలోచిస్తున్న ఈ రోజుల్లో ఊబకాయానికి కూడా మందుని కనిపెట్టారు అమెరికన్ వైద్యులు. ఇది
ఊబకాయంతో బాధపడుతున్న వారందరికీ శుభవార్త.
ఊబకాయానికి ఔషదాన్ని కనుక్కోవాలని ఇప్పటికీ ఎంతోమంది వైద్యులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు అన్నీ సఫలం అయినా కూడా.. పై నుండి వారికి అనుమతి లభించక వాటిలో ఏ ఒక్కటి మార్కెట్‌లో విడుదల కాలేదు. మొదటిసారి ఊబకాయం కోసం కనిపెట్టిన ఔషదాన్ని అమెరికన్ ప్రభుత్వం కూడా అనుమతించడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నోవో నోర్డిస్క్ అనే ఫార్మసీ సంస్థ ఊబకాయానికి మందు కనుక్కొని, దానిని మార్కెట్‌లోకి కూడా విడుదల చేసింది. అంతే ఆ సమస్య ఉన్నవారంతా ఫార్మసీలకు పోటెత్తారు. 'వీగోవీ' అనే ఈ ఔషదం దాదాపు అమెరికాలోని అన్ని మెడికల్ షాపులలో లభిస్తోంది. ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య అమెరికాలో ఎక్కువగా ఉండడంతో ఉన్నపళంగా 'వీగోవీ' సేల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి.
'వీగోవీ' అంటే ఇంజెక్షన్. డయాబెటీస్ ఎక్కువగా ఉన్నవారు ఎలాగైనా ఇన్సులిన్ తీసుకుంటారో.. ఊబకాయం ఉన్నవారు కూడా అలాగే వారానికి ఒకసారి 'వీగోవీ'ని తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఆకలి కంట్రోల్‌లో ఉండి మనిషి శరీరానికి ఎంత కావాలో అంతే తినగలుగుతారు. దీంతో 15 శాతం వరకు బరువు తగ్గే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.
ఊబకాయం ఉన్నవారికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెప్పడంతో వారంతా ఎలాగైనా వెంటనే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారు. అది కూడా 'వీగోవీ'కి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్‌కు తగినట్టుగా నోవో నోర్డిస్క్ సంస్థ వీటిని సప్లై చేయలేకపోతుందని సమాచారం. వచ్చే ఏడాది నాటికి అమెరికాలో వీగోవీకి భారీ ఆదరణ లభించే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాకపోతే వీగోవీ వల్ల వాంతులు, యాసిడ్ రీఫ్లక్స్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com