కొత్త జంట ప్రాణాలు తీసిన బాత్‌రూమ్ షవర్..

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ జంటకు పెళ్లై రెండు వారాలు కూడా కాలేదు. అంతలోనే విధికి కన్నుకుట్టింది. విద్యుత్ షాక్‌తో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. భారత సంతతికి చెందిన జంట దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్‌లో ఉండే జహీర్ సరాంగ్, నబీల్హా ఖాన్‌కు రెండు వారాల క్రితమే పెళ్లైంది. ఇటీవలే హనీమూన్ వెళ్లొచ్చారు. మొదట బాత్‌రూంలో భార్య కరెంట్ షాక్‌కు గురి కాగా.. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఆదివారం దంపతులిద్దరూ బాత్‌రూంలో విగత జీవులుగా పడి ఉండడం చూసి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృత దేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. జహీర్ సరాంగ్, నబీల్హా ఖాన్ బాత్‌రూంలోని షవర్ ట్యాప్‌కు విద్యుత్ ప్రసారం కావడంతోనే చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పెళ్లైన కొద్ది రోజుల్లోనే కొత్త జంట ఇలా ప్రాణాలు కోల్పోవడం ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయితే దంపతుల మృతికి అసలు కారణం ఏంటనేది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తరువాత తెలుస్తుందని పోలీస్ అధికారి మవేలా మసండో తెలిపారు. ఇప్పటికే జోహన్నెస్ బర్గ్ సిటీ విద్యుత్ శాఖతో కలిసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com