Suriname: దక్షిణ అమెరికా దేశమైన సురినామ్‌లో దారుణం..తొమ్మిది మంది ఊచకోత

దక్షిణ అమెరికా దేశమైన సురినామ్‌లో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి పారామరిబో సమీపంలోని మీర్జోర్గ్ పట్టణంలో ఓ వ్యక్తి కత్తితో ఉన్మాదిలా ప్రవర్తించి తొమ్మిది మందిని ఊచకోత కోశాడు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. సదరు వ్యక్తి తన సొంత కుటుంబ సభ్యులతో పాటు పొరుగువారిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు అతడి కాలిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఈ ఘోర ఘటనపై సురినామ్ అధ్యక్షురాలు జెన్నిఫర్ గీర్లింగ్స్ సైమన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘కుటుంబం, స్నేహితులు ఒకరికొకరు అండగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి దారుణం జరగడం దురదృష్టకరం’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా సురినామ్‌లో ఇలాంటి హింసాత్మక ఘటనలు చాలా తక్కువగా జరుగుతుంటాయి, అందుకే ఈ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

