Pakistan Blast : అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..
సోమవారం అర్ధరాత్రి బలూచిస్తాన్‌లోని జిల్లాలో ఒక ల్యాండ్‌మైన్ పేల్చారు దుండగులు. పంజ్‌గూర్ దగ్గర జరిగిన ఈ పేలుడులో యూనియన్ కౌన్సిల్ (యుసి) ఛైర్మన్‌తో సహా ఏడుగురు మరణించారని అధికారులు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఒక నిఖాకు హాజరై తిరిగి వస్తున్న బల్గతార్ యుసి ఛైర్మన్ ఇష్తియాక్ యాకూబ్ ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, రిమోట్ సాయంతో పేల్చడానికి అనువుగా ఓ ల్యాండ్‌మైన్ అమర్చారని స్థానిక డిప్యూటీ కమిషనర్ తెలిపారు. వాహనం బల్గతార్ ప్రాంతంలోని చకర్ బజార్ వద్దకు రాగానే.. రిమోట్ సాయంతో వాహనాన్ని పేల్చివేశారని తెలిపారు. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న మహ్మద్ యాకూబ్, ఇబ్రహీం, వాజిద్, ఫిదా హుస్సేన్, సర్ఫరాజ్, హైదర్ అనే ఏడుగురు వ్యక్తులు ఉన్నారని వీరంతా బల్గతార్, పంజ్‌గూర్ ప్రాంతానికి చెందినవారని తెలిపారు.
సరిగ్గా ఇదే స్థలంలో 2014లో ఇష్తియాక్ యాకూబ్ తండ్రి యాకుబ్ బల్గాత్రి తోపాటు అతని పదిమంది అనుచరులను కూడా సరిగ్గా ఇదే తరహాలో హత్య చేశారు. అయితే ఆ ప్లాన్ వేసినది మేమే అంటూ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(BLF) అప్పుడే ప్రకటించింది. తాజాగా జరిగిన సంఘటనకు కూడా వారే బాధ్యులై ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ దాడి ఎవరు చేశారు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. పాక్‌లోని పలు నగరాల్లో బలూచిస్తాన్ తిరుగుబాటు దారులు దాడులు చేస్తూనే ఉంటారు. తమకు స్వాతంత్ర్యం కావాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఇటువంటి దాడులకు పాల్పడుతుంది. గతంలో స్టాక్ మార్కెట్‌పై కూడా దాడి జరిపింది బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అన్న సంగతి తెలిసిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com