Iran ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించిన ఇరాన్

ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించింది ఇజ్రాయెల్, ముందు వాళ్లు దాడులు ఆపితే తామూ నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలమధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. ఆఖరి నిమిషం వరకు తమ సైన్యం ఇజ్రాయెల్‌తో పోరాడుతూనే ఉందని చెప్పారు. అయితే యుద్ధం కొనసాగించాలన్న ఆలోచన తమకు లేదన్నారు. ప్రస్తుతానికి కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరుగలేదని వెల్లడించారు.
ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిందే ఇజ్రాయెల్. మొదట వారు దాడులు ఆపితే తాము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఈ విషయాన్ని చాలాసార్లు స్పష్టం చేశాం. ఇప్పటివరకు కాల్పుల విరమణ, సైనిక కార్యకలాపాల విరమణపై ఎలాంటి ఒప్పందం జరుగలేదు. అయితే ఇరాన్ ప్రజలపై ఉదయం 4 గంటలలోపు (స్థానిక కాలమానం) ఇజ్రాయెల్ దాడులను ఆపితే, ఆ తర్వాత ప్రతిదాడులు చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు ధైర్యంగా పోరాడుతున్న సైనిక బలగాలకు ఇరాన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపుతున్నాను.
కాగా, 12 రోజుల ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి ముగింపు లభించిదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని చెప్పారు. ఈ ఒప్పందం మరో 24 గంటల్లో అమల్లోకి వస్తుందని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో పోస్టు చేశారు. 12 రోజుల యుద్ధానికి ఇది ముగింపని, యుద్ధం విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు అంటూ పేర్కొన్నారు. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయని, 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com