Imran Khan : ఇమ్రాన్ ఖాన్ గట్టెక్కడం ఎలా..? ఆయనకున్న బలమెంత?
Imran Khan : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోతారా? ఆయన ప్రభుత్వంపై జాతీయ అసెంబ్లీలో విపక్షాలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆయన పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లైంది. ఏప్రిల్ 3న ఓటింగ్ జరగుతుండటంతో.. ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సొంత మంత్రులే ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. దీంతో.. జాతీయ అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవడం అసాధ్యమేనన్నది పొలిటికల్ అనలిస్ట్‌ల వాదన.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో.. మొత్తం 342 సీట్లు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ 149 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజార్టీ లేకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్రులతో కలిపి ఆయన సంఖ్యా బలం 176కు పెరిగింది. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు ఇమ్రాన్ ఖాన్. అయితే కొద్ది కాలానికే ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. మరోవైపు పాకిస్థాన్ అప్పులు పెరిగి ఆర్థిక సంక్షోభం మొదలైంది. ద్రవ్యోల్బణం పెరిగింది. అటు.. సైన్యం కూడా ఇమ్రాన్‌ఖాన్‌పై అసంతృప్తిగా ఉంది. దీంతో ఇమ్రాన్‌పై అసమ్మతి సెగ మొదలైంది.
దీంతో ఇమ్రాన్‌ఖాన్‌ను గద్దె దించేందుకు పావులు కదిపాయి ప్రతిపక్షాలు. జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మరోవైపు ఇమ్రాన్‌పై సొంత పార్టీకి చెందిన ఎంపీలు కూడా తిరుగుబాటుకు రెడీ అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు సభ్యులు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు ఇమ్రాన్ ఖాన్. ఆయన పదవి నుంచి దించాలంటే ప్రతిపక్షాలకు 172 మంది సభ్యుల మద్దతు అవసరం.
ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పీటీఐ - 155, ఎంక్యూఎంపీ - 7 , పీఎంఎల్(క్యూ) - 4, బీఏపీ - 1 , గ్రాండ్ డెమోక్రటిక్ అలియన్స్ - 3 , ఏఎంఎల్ - 1తో కలిసి అధికారపక్షం మొత్తం 171కి చేరింది. అయితే.. ఇందులో పీటీఐకి చెందిన 24 మంది ఎంపీలు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అవిశ్వాస తీర్మానంలో వారు ఇమ్రాన్‌కు మద్దతుగా ఓటేస్తారన్న నమ్మకం లేదు.
మరోవైపు ప్రతిపక్షాలు బలం చూస్తే.... పీఎంఎల్‌ఎన్ - 84, పీపీపీ - 56, ఎంఎంఏ - 14, బీఎన్‌పీ - 4, జేడబ్ల్యూపీ - 1 , బీఏపీకి నాలుగు కాగా... ఈ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అందులోని నలుగురు వ్యక్తులు ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించారు. మరోవైపు ... పీఎంఎల్‌క్యూ ఉన్న ఒకరు ... ఇమ్రాన్ ప్రభుత్వాన్ని మద్దతుగా ఇస్తున్నారు. అయితే పీఎంఎల్‌క్యూ సభ్యుడు తారిక్ బషీర్ చీమా ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసి ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఓటేస్తానని ప్రకటించారు. వీరు కాక.. స్వతంత్రులు నలుగురు ఉన్నారు. దీంతో విపక్షాల సంఖ్య మొత్తం - 169కి చేరింది.
ఈ నెల 31 సాయంత్రం 4 గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 3న ఓటింగ్ చేపట్టనున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ బలపరీక్షలో గెలిచి ప్రభుత్వాన్ని కొనసాగిస్తారో లేదా క్లీన్ బౌల్ట్ అయ్యి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందో చూడాలి..! అయితే ఈ రాజకీయ అనిశ్చితిని ముగించేందుకు ఇమ్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com