అనుకున్నంతా అయ్యింది.. అఫ్గన్‌లో షరియా చట్టాలు..

అనుకున్నంతా అయ్యింది.. అఫ్గన్‌లో షరియా చట్టాలు..
కొన్నాళ్ల క్రితం వరకు అఫ్గాన్‌ పైలట్లను తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ, తాలిబన్‌ బలగాలను కలిపి

అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు పరిపాలనపై స్పష్టతనిచ్చారు. అఫ్గానిస్తాన్‌లో ఇక ప్రజస్వామ్యం ఉండదని వెల్లడించారు. దేశాన్ని తాలిబన్‌ లీడర్‌షిప్‌ కౌన్సిల్‌ ద్వారా పరిపాలించనున్నారని తెలిపారు. తాలిబన్‌ సుప్రీం లీడర్‌ హోదాలో హైబతుల్లా అఖుండ్‌జాదా వ్యవహరిస్తారని తాలిబన్‌ ప్రతినిధి వహిబుల్లా హషీమీ వెల్లడించారు. ఇప్పటికే తాలిబన్లు అఫ్గాన్‌ పైలట్లు, సైనికులు విధుల్లో చేరాలని సూచించారు. వీరిలో ఎంత మంది విధుల్లో చేరతారనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ కౌన్సిల్‌ పాలన కొత్తేమీ కాదు. 1996-2001 వరకు అప్పటి తాలిబన్‌ చీఫ్‌గా ముల్లా ఒమర్‌ వ్యవహరించారు. ఆయన చాలా కాలం అజ్ఞాతంలోనే ఉన్నారు. రోజువారీ పాలన మాత్రం కౌన్సిల్‌ చూసుకునేది. అదే విధంగా ఇప్పుడు కూడా అఖుండ్‌జాదా కౌన్సిల్‌ పైస్థానంలో ఉంటారు. ఆయన కింద ఉన్న వ్యక్తి అధ్యక్షుడి బాధ్యతలను నిర్వహిస్తారు.

అఖుండ్‌జాదా కింద మౌల్వీ యాకూబ్‌, సిరాజుద్దీన్‌ హక్కానీ, అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఉన్నారు. పాలనకు సంబంధించిన చాలా అంశాలపై తాలిబన్లు ఓ నిర్ణయానికి రాలేదని వహిబుల్లా హషీమీ తెలిపారు. షరియా చట్టం అమల్లో ఉంటుందని వెల్లడించారు. ప్రజాస్వామ్యం ఉండబోదని స్పష్టం చేశారు. అటువంటి వ్యవస్థకు తమ దేశంలో పునాది లేదని వివరించారు.

కొన్నాళ్ల క్రితం వరకు అఫ్గాన్‌ పైలట్లను తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ, తాలిబన్‌ బలగాలను కలిపి ఓ సైన్యం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు హషీమీ వెల్లడించారు. అఫ్గాన్‌ సైన్యంలో విదేశాల్లో శిక్షణ పొందిన వారు ఉండటంతో వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సైన్యంలో సంస్కరణలు చేయాల్సి ఉందని.. వారు తమకు అవసరమని హషీమీ వెల్లడించారు. తాము స్వాధీనం చేసుకొన్న విమానాలు, హెలికాప్టర్లు విమనాశ్రయాల్లో పడి ఉండటం వల్ల పైలట్ల అవసరం ఉందని తెలిపారు. వారిని సంప్రదించి తిరిగి విధుల్లో చేరమని కోరారు.

తాలిబన్లు కాబుల్‌లోకి ప్రవేశించడం వల్ల హమీద్‌ ఖర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో అమెరికా ఇచ్చిన డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను పొరుగున ఉన్న ఉజ్బెకిస్థాన్‌లోని తర్మీజ్‌ ఎయిర్‌ పోర్టుకు తరలించారు. వీటిలో ఏ-29 సూపర్‌ టూకోన్‌ యుద్ధవిమానాలు 22 వరకు ఉన్నాయి.

ఇక బ్లాక్‌ హాక్‌తో కలిపి 26 హెలికాప్టర్లు ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్‌ ప్రభుత్వం మాత్రం 22 విమానాలు 24 హెలికాప్టర్లు మాత్రమే ఉన్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. అఫ్గాన్‌ సరిహద్దులు దాటి ఇవి వచ్చేయడం వల్ల బలవంతంగా తమ భూభాగంలో దింపామని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story