Marriage scams: బంగ్లాదేశ్ యువతులతో అక్రమ వివాహాలు వద్దు : చైనా అడ్వైజరీ

అక్రమ సరిహద్దు వివాహ బంధాల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం పట్ల అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్‌లోని చైనా ఎంబసీ తమ దేశ పౌరులకు ఆదివారం సలహా ఇచ్చింది. చట్టానికి వ్యతిరేకంగా విదేశాలకు చెందిన యువతులను కొనుగోలు చేసే ఆలోచనను తిరస్కరించాలని.. బంగ్లాదేశ్‌లో పెళ్లి చేసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని చైనా రాయబార కార్యాలయం కోరింది. చైనాలో వధువుల అక్రమ రవాణాపై తీవ్ర ఆందోళనలు పెరుగుతున్న వేళ.. చైనా ఎంబసీ హెచ్చరించింది. గతంలో చైనాలో వన్ చైల్డ్ విధానం, మగ పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వడం కారణంగా.. ప్రస్తుతం చైనా లింగ అసమతుల్యతను ఎదుర్కొంటోంది. సుమారు 3 కోట్ల మంది చైనా పురుషులకు వధువులు దొరకడం లేదు. ఇలాంటి వారిని లెఫ్ట్ ఓవర్ మెన్ అని పిలుస్తారు. చైనాలో తగ్గుతున్న పెళ్లిళ్ల కారణంగా విదేశీ వధువులకు డిమాండ్ పెరిగింది.
ది డైలీ స్టార్ అనే న్యూస్ పేపర్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. పెళ్లి పేరుతో బంగ్లాదేశ్ మహిళలను చైనాలో విక్రయిస్తున్న కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. క్రిమినల్ గ్యాంగ్‌లు ఈ బంగ్లాదేశ్ మహిళల అక్రమ రవాణా నిర్వహిస్తున్నాయి. ఈ పెళ్లిళ్లలో చాలా వరకు అక్రమంగా, దోపిడీ మార్గాల ద్వారా ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి పెళ్లిళ్లు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తాయని చైనా రాయబార కార్యాలయం వెల్లడించింది.
బంగ్లా చట్టాల ప్రకారం.. మానవ అక్రమరవాణాకు పాల్పడి, దోషిగా తేలితే ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి యావజ్జీవ, మరణశిక్షలు కూడా ఉండొచ్చు. కొన్ని క్రిమినల్ నెట్‌వర్క్‌లు గతంలో ఆ దేశ యువతులను భారత్‌కు ట్రాఫికింగ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలతో కొన్నేళ్ల కిందట ఢాకాలో 11 మందిని అరెస్టు చేశారు. యువతుల అక్రమ రవాణకు టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లను వినియోగించారని అప్పట్లో మీడియా కథనాలు వెల్లడించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com