No Kings protests: ట్రంప్‌కు వ్యతిరేకంగా ‘‘నో కింగ్స్’’ నిరసనలు..

అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతరేకంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. ‘‘ నో కింగ్స్’’ అనే పేరుతో ప్రజలు నిరసనలు నిర్వహిస్తున్నారు. శనివారం న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ట్రంప్ తీసుకుంటున్న కఠిన విధానాలపై తమ కోపాన్ని వ్యక్తం చేస్తూ ‘‘ నో కింగ్స్’’ అనే పేరుతో నినాదాలు చేస్తున్నారు. అయితే, అధికార రిపబ్లిక్ పార్టీ మాత్రం వీటిని ‘‘అమెరికాను ద్వేషించే ర్యాలీలు’’గా విమర్శించింది.
దేశమంతా 2700కు పైగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అమెరికాలోని చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల వరకు ప్రజలు నిరసనలతో హోరెత్తించారు. ట్రంప్ ఫ్లోరిడా నివాసం మార్-ఎ-లాగోలో కూడా ప్రదర్శని నిర్వహించారు. ఈ ఏడాది ట్రంప్ కఠిన వలస విధానాలకు వ్యతిరేకంగా జూన్ 14న ట్రంప్ పుట్టిన రోజున జరిగిన ర్యాలీలను, తాజా ర్యాలీలు గుర్తుచేస్తున్నాయి.
ట్రంప్ మీడియాపై దాడి చేయడం, రాజకీయ ప్రత్యర్థులనపై కేసులు పెట్టడం, ఆయన పాలన నియంత లక్షణాలను ప్రదర్శిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ట్రంప్ అధ్యక్షుడిగా తన పరిపాలనను పూర్తి అధికారంగా భావిస్తున్నాడు. కానీ అమెరికాలో రాజులు ఉండరు.’’ అని ఉద్యమ నిర్వాహకులు నినదిస్తున్నారు. ప్రస్తుతం, అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ చేసింది. దీంతో వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించింది. ఈ పరిణామాలు ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని నింపాయి. ‘‘మేము అమెరికాను ప్రేమిస్తాం, ట్రంప్‌ను కాదు’’అని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు.
అయితే, ఈ నిరసనలపై ట్రంప్ పెద్దగా స్పందించలేదు. ‘‘వాళ్లు నన్ను రాజుగా చెబుతున్నారు. కానీ నేను రాజు కాదు’’ అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ఈ నిరసనలు ‘‘హేట్ అమెరికా’’ ర్యాలీలు అని ఆయన అనుచరుడు స్పీకర్ మైక్ జాన్సన్ అన్నారు. ఈ ర్యాలీల్లో పాల్గొంటున్న వారు డెమోక్రాటిక్ తీవ్రవాద విభాగం అని దుయ్యబడుతున్నారు. ఇక, ఈ ఉద్యమానికి మద్దతుగా లండన్, బార్సిలోనా వంటి నగరాల్లో అమెరికన్ ఎంబసీల ముందు నిరసనలు జరిగాయి. ఈ నిరసనలకు డెమోక్రాటిక్ పార్టీ మద్దతు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com