China : భారత్‌ సాధిస్తున్న ప్రగతిని చైనా చూస్తోంది- రాజ్‌నాథ్‌ సింగ్

China : భారత్‌ సాధిస్తున్న ప్రగతిని చైనా చూస్తోంది- రాజ్‌నాథ్‌ సింగ్
భారత్‌ను ఎవరూ తేలిగ్గా తీసుకోలేరన్న రక్షణ మంత్రి

భారత్‌ ప్రగతి ఆర్ధిక వృద్ధి సాధిస్తున్న అభివృద్ధిని చూసి చైనాకు తత్వం బోధపడుతోంది. భారత్‌ సాధిస్తున్న ప్రగతిని అర్థం చేసుకుంటోంది. భారత్‌ ఆర్థిక వృద్ధిని సాక్షాత్తూ చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ప్రశంసించగా ఇప్పుడు ఆ వ్యాఖ్యలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ గుర్తు చేశారు. భారత్‌ వ్యూహాత్మక, ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని చైనా కూడా గుర్తిస్తోందని రాజ్‌నాథ్‌ అన్నారు. ఇప్పుడు ప్రపంచ అభివృద్ధిలో భారత్‌ పాత్రను విస్మరించలేమన్న విషయం డ్రాగన్‌కు తెలిసొచ్చిందని అన్నారు.

భారత్‌ అభివృద్ధిపై ఎప్పుడూ పెదవి విప్పని డ్రాగన్‌ తన తీరును మార్చుకుంటోంది. ప్రపంచ దేశాల్లో భారత్‌ ప్రగతిని అంగీకరిస్తోంది. భారత్ బలాన్ని చైనా విశ్వసించడం ప్రారంభించిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అన్నారు. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్‌ ఇండియా హౌస్‌లో ప్రవాసాంధ్రులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న గ్లోబల్ టైమ్స్‌..ఇటీవల ప్రచురించిన కథనంలో భారత్‌ ఆర్థిక వృద్ధిని ప్రశంసించిన తీరును రాజ్‌నాథ్‌ గుర్తు చేశారు. భారత వృద్ధిని గుర్తించడంలో చైనా దృక్పథం మారిందని రక్షణమంత్రి అన్నారు. భారత్‌ వ్యూహాత్మక శక్తిగా ఆవిర్భావం చెందుతోందని స్వయాన చైనా అంగీకరించిందని తెలిపారు. భారత ఆర్థిక, విదేశాంగ విధానాలు అద్భుతంగా ఉన్నాయని డ్రాగన్‌ విశ్వసించిందని రాజ్‌నాథ్‌ అన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా.. వ్యూహాత్మక శక్తిగా భారత్‌ ఎదుగుతోందని చైనా ప్రభుత్వం నమ్మిందని వెల్లడించారు. తాము ఎవరినీ శత్రువులుగా చూడబోమన్న రాజ్‌నాథ్‌ భారత్‌-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాయని ప్రపంచానికి తెలుసని రక్షణ మంత్రి వెల్లడించారు. ఐనా పొరుగు దేశాలతో సత్సంబంధాలనే తాము కోరుకుంటామని వివరించారు. ప్రపంచంలో భారత్‌ కీలక స్థానాన్నివిస్మరించలేమని చైనా ప్రభుత్వం ఇప్పుడు అంగీకరిస్తోందని రాజ్‌నాథ్‌ అన్నారు.

ఇటీవలే భారత్‌ ఆర్థిక వృద్ధిని చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ప్రశంసించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం వ్యూహాత్మకంగా ఎదుగుతోందని ప్రపంచవేదికపై క్రియాశీలంగా మారిందని కొనియాడింది. ఈ మేరకు ‘భారత్‌ నరేటివ్‌’పేరుతో గ్లోబల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. బలమైన ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ సంబంధాలు, చైనాతో వైఖరిలో మార్పు అంశాలను ప్రస్తావించింది. గతంలో చైనాతో వాణిజ్య సమతుల్యత లోపించినప్పుడు ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని భారత్‌ ఆలోచించేదని, కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని చైనా అధికారిక పత్రిక పేర్కొంది. ఎగుమతి సామర్థ్యంపై భారత్‌ దృష్టి సారిస్తోందని స్పష్టం చేసింది. రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ప్రజాస్వామ్య ఏకాభిప్రాయం ఉండాలని చెప్పే స్థాయి నుంచి భారతీయతను వివరిస్తూ దానిని హైలైట్‌ చేసే స్థాయికి చేరుకుందని గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. భారత విదేశాంగ విధానాన్ని కూడా చైనా మీడియా ప్రశంసించింది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా, జపాన్‌, రష్యా తదితర దేశాలతో పాటు కీలక ప్రాంతీయ కూటములతో సంబంధాలు మెరుగుపడ్డాయని, భారత్ అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ఇది కూడా కారణమని చెప్పుకొచ్చింది. తనని తాను ప్రపంచ శక్తిగా పరిగణించుకుంటున్న ఇండియా.. గత పదేళ్లలో వ్యూహాత్మకంగా ఎదిగిందని చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story