Vladimir Putin : ఊహించిన దానికంటే ఉక్రెయిన్‌‌తో భీకర యుద్ధం ఉంటుంది : పుతిన్

Vladimir Putin : ఊహించిన దానికంటే ఉక్రెయిన్‌‌తో భీకర యుద్ధం ఉంటుంది : పుతిన్
Vladimir Putin : కొరకరాని కొయ్యలా మారిన ఉక్రెయిన్ ఆక్రమణనే లక్ష్యంగా రష్యా మరింత భీకరంగా దాడులు చేస్తోంది.

Vladimir Putin : కొరకరాని కొయ్యలా మారిన ఉక్రెయిన్ ఆక్రమణనే లక్ష్యంగా రష్యా మరింత భీకరంగా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా పలు నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా మిస్సైళ్ల దాటికి అనేక భవనాలు నేలమట్టమై శిథిలాలుగా మారుతున్నాయి. రెండు దేశాలకు చెందిన వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చెర్నిహివ్‌లోని నివాస ప్రాంతాలపై రష్యా ఆర్మీ బాంబులు కురిపించడంతో 33 మంది పౌరులు మృతి చెందారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న వేళ వారం రోజుల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది.

యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించింది రష్యా. ఉక్రెయిన్‌లోని కీలక నగరాలైన మరియుపోల్, వోల్నావఖాలో కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ రెండు నగరాల్లోని పౌరులు వెంటనే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అల్టిమేట్టం ఇచ్చింది. ఉక్రెయిన్‌ కాలమానం ప్రకారం ఉదయం పదకొండున్నర నుంచి ఐదున్నర గంటల పాటు ఈ తాత్కాలిక విరామం ప్రకటించింది. ప్రపంచ దేశాల ఒత్తిడి, యుద్ధ రంగంలో చిక్కుకున్న పౌరులను తరలించేందుకు వీలుగా.. కాల్పుల విరమణ ప్రకటించాలని భారత్ విజ్ఞప్తి చేసిన గంటల్లోనే రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది.

రష్యా తాత్కాలిక యుద్ధ విరామం ప్రకటించడంపై ప్రపంచదేశాలు ఉలిక్కిపడుతున్నాయి. రష్యా వైమానిక దాడులను మరింత ఉధృతం చేయబోతోందని ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకునే దిశగా భీకర దాడులకు పుతిన్ సైన్యం సమాయత్తం అవుతోందని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. భారీ ప్రాణనష్టం తప్పదని, అందుకే ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిందని తెలిపింది.

మరోవైపు.. రష్యా కాల్పుల విరమణ ప్రకటించినా.. అంతకుముందు చేసిన దాడులతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలు దద్దలిల్లాయి. కీవ్‌ నగరంపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఉక్రెయిన్ సైతం అంతే ధీటుగా ప్రతిఘటిస్తున్నాయి. దేశ సైనికులతో పాటు ఉక్రెయిన్ పౌరులు, విదేశాల్లో ఉంటున్న వారు కూడా స్వదేశానికి చేరుకుని తమ మాతృభూమి కోసం అండగా నిలుస్తున్నారు. విద్యార్థులు, లాయర్లు, నటీనటులు, క్రీడాకారులు, సైబర్ ఆర్మీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి, ఆయుధాలను చేతబట్టి, తమ వంతుగా రష్యాపై పోరాడుతున్నారు.

మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు రష్యాతో మూడోసారి చర్చలు జరపాలని ఉక్రెయిన్ నిర్ణయించింది. ఇప్పటికే రెండుసార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అయితే సమరానికి ముగింపు పలికేందుకు మరో రెండ్రోజుల్లో మూడోసారి రష్యాతో చర్చలు జరపాలని యోచిస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు తెలిపారు. మరి మూడోసారి అయినా యుద్ధానికి ముగింపు పలుకుతారా..? లేక తగ్గేది లేదంటూ యుద్ధమే చేస్తారా..? అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story