Bangladesh Crisis: బంగ్లాదేశ్ పార్లమెంట్‌ రద్దు..

తాత్కాలిక ప్రభుత్వానికి సారథ్యం వహించనున్న మహ్మద్‌ యూనస్‌

ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా అనంతరం బంగ్లాదేశ్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్‌ షహబుద్దీన్‌ ఈ ఏడాది జనవరి 7న ఏర్పాటైన షేక్‌ హసీనా ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని రద్దు చేశారు. త్రివిధ దళాల అధిపతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు, విపక్ష వ్యతిరేక ఉద్యమ నేతలతో బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు చర్చలు జరిపారు. అనంతరం పార్లమెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడి కార్యాలయంలో ఓ ప్రకటనలో పేర్కొంది. మరో వైపు బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానున్నది. ఈ ప్రభుత్వానికి నోబెల్‌ శాంతి పురస్కారం గ్రహీత మహ్మద్‌ యూనస్‌ సారథ్యం వహించనున్నారు. ఇందుకు ఆయన అంగీకరించినట్లుగా పలు మీడియా సంస్థలు తెలిపాయి. 84 సంవత్సరాల ఆర్థిక వేత్త విద్యార్థి నేతల అభ్యర్థన మేరకు ఆయన తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా కొనసాగించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు పేర్కొన్నాయి.

మరో వైపు బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, కీలక ప్రతిపక్ష నేత ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. ప్రధానిగా షేక్‌ హసీనా రాజీనామా అనంతరం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆమెను జైలు నుంచి విడుదల చేయాలని ప్రెసిడెంట్‌ షహబుద్దీన్‌ ఆదేశించారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్‌పర్సన్ బేగం ఖలీదా జియాను తక్షణమే విడుదల చేయాలని సమావేశం నిర్ణయించారు. ఈ క్రమంలో అధ్యక్షుడి ఆదేశాల జారీ చేసిన కొద్దిగంటల్లోనే ఆమె విడుదలయ్యారు. మాజీ ప్రధాని 2018లో అవినీతి కేసులో అరెస్టయ్యారు. గతకొంతకాలంగా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 2.50లక్షల డాలర్ల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆమెపై అభియోగాలను మోపారు. అవినీతి ఆరోపణలను బీఎన్‌పీ ఖండించింది. జియా 1991-1996 వరకు, 2001-2006 వరకు బంగ్లాదేశ్‌ ప్రధానిగా పని చేశారు. ఆమె 1996 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించగా, హసీనా అవామీ లీగ్‌తో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. దాంతో ఖలిదా ప్రభుత్వం 12 రోజుల పాటే కొనసాగింది. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఖలీదా జియా లివర్ సిర్రోసిస్, కీళ్లనొప్పులు, మధుమేహం, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె, కళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.

మరో వైపు.. తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించబోతున్న మహ్మద్‌ యూనస్‌ గతంలో కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కేసులో దోషిగా తేలారు. యూనస్‌తో పాటు ఆయనకు చెందిన గ్రామీణ్‌ టెలికాం సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులు సైతం దోషులుగా తేలిన విషయం తెలిసిందే. మైక్రో ఫైనాన్సింగ్‌ గ్రామీణ బ్యాంకు ద్వారా లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేశారన్న ఘనత యూనస్‌కు ఉన్నది. కానీ, దానికి విరుద్ధంగా షేక్‌ హసీనా నుంచి ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు. పేదల రక్తాన్ని వడ్డీల రూపంలో పీలుస్తున్నారంటూ గతంలో షేక్‌ హసీనా విమర్శించారు. అయితే, పెట్టుబడిదారి విధానం, సామాజిక బాధ్యత విధానాల కలయికలో యూనస్‌ గ్రామీణ్‌ బ్యాంకును నెలకొల్పారు. పేదలకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా కొద్ది మొత్తాన్ని అందించడం ఈ బ్యాంకు ఉద్దేశం.

Tags

Next Story