Nobel Prize: వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి..

Nobel Prize: వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి..
కొవిడ్ వ్యాక్సిన్లపై పరిశోధనలకే!

వైద్య శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్ పురస్కారం దక్కింది. కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు నోబెల్‌ పురస్కారం అందజేయనున్నట్లు స్వీడన్‌లోని ఆ కమిటీ ప్రకటన చేసింది. కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ కొవిడ్​-19పై అంతులేని పోరాటం చేసి, ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో కృషి చేశారు. వీరు న్యూక్లియోసైడ్‌ బేస్‌ మాడిఫికేషన్లకు సంబంధించిన పరిశోధనల్లో కొత్త విషయాలను కనుగొన్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం తరఫున ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో ప్రతి ఏడాది నోబెల్ బహుమతి ప్రకటిస్తారు. వైద్య రంగంలో అత్యున్నత పురస్కారంగా దీనిని పరిగణిస్తారు. బహుమతితో పాటు ఈసారి విజేతలకు 11 మిలియన్​ స్వీడిష్​ క్రౌన్​ (1 మిలియన్​ డాలర్​) నగదు కూడా లభిస్తుంది. అంటే ఇండియన్​ కరెన్సీలో అది సుమారు రూ. 8.3కోట్లు. గత ఏడాది ఈ అవార్డును స్వాంటె పాబో స్వీకరించారు. హోమినిన్‌ జన్యువులకు సంబంధించి ఆయన పరిశోధనలు చేశారు.


1990వ దశకం ప్రారంభంలోనే బయో కెమిస్ట్‌ అయిన కటాలిన్‌ కరికో, ఎంఆర్‌ఎన్‌ఎ ప్రాధాన్యతను గుర్తించారు. ఆ తర్వాత ఆమె, ఆమె కొలీగ్‌, ఇమ్యూనాలజిస్ట్‌ అయిన డ్రూ వెయిస్‌మన్‌ పరిశోధనాంశాలతో 2005లో ఒక పత్రాన్ని ప్రచురించారు. న్యూక్లియోసైడ్‌ మాడిఫికేషన్‌ ప్రభావాన్ని, రోగ నిరోధక వ్యవస్థపై అది కనబరిచే ప్రభావాన్ని ఆ పత్రంలో రూపొందించారు. ఆ తర్వాత 2008, 2010ల్లో కూడా పరిశోధనా పత్రాలు ప్రచురించారు. అవన్నీ కలిసి కోవిడ్‌ సమయంలో ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్ల అభివృద్ధికి దోహదపడ్డాయి.

హంగరీకి చెందిన కరికో సాగన్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, పెన్సిల్వేనియా యూనివర్సిటీలో అనుబంధ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె 2022 వరకూ బయాన్‌టెక్‌ ఆర్‌ఎన్‌ఎ ఫార్మస్యూటికల్స్‌లో సీనియర్‌ ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఇక అమెరికాకు చెందిన వెయిస్‌మన్‌ పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన పెరల్‌మాన్‌ వైద్య పాఠశాలలో టీకాల పరిశోధనా విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.


ఈ నోబెల్​ అవార్డులను 1901 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. స్వీడెన్​కు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ఆల్​ఫ్రెడ్​ నోబెల్​ వీటిని ఇచ్చేవారు. ఆయన మరణం తర్వాత కూడా ఈ అవార్డులను కొనసాగిస్తున్నారు. వైద్యం, శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక విభాగాల్లో నోబెల్​ బహుమతిని ప్రకటిస్తారు. ఈసారి వైద్య రంగంతో ఈ ఈవెంట్​ మొదలైంది. రానున్న రోజుల్లో ఇతర బహుమతులను ప్రకటిస్తారు.నేటి నుంచి వరుసగా గురువారం వరకు నోబెల్ బహుమతుల ప్రకటనలు ఉంటాయి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, అర్థ శాస్త్రంలో నోబెల్ అసెంబ్లీ పురస్కారాలు ప్రకటిస్తుంది. స్టాక్​హోంలో ఈ ఏడాది డిసెంబర్​ 10న జరగనున్న ఈవెంట్​లో.. స్వీడెన్​ రాజు చేతుల మీదుగా. విజేతలు బహుమతులను, నగదును అందుకుంటారు.

Tags

Read MoreRead Less
Next Story