Nobel Prize : మైక్రో ఆర్‌ఎన్‌ఏ ఆవిష్కర్తలకు వైద్య నోబెల్

మైక్రోఆర్‌ఎన్‌ఏను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌కు వైద్య శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం లభించింది. సోమవారం నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. జన్యు క్రియను క్రమబద్ధీకరించే ప్రాథమిక సూత్రం మైక్రో ఆర్‌ఎన్‌ఏనే అనే విషయాన్ని వీరు గుర్తించారు. జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఎలా పని చేస్తాయనే ప్రాథమిక అంశాన్ని వీరి ఆవిష్కరణ నిరూపించిందని నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. విక్టర్ ఆంబ్రోస్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్‌లో నాచురల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. రవ్‌కున్ హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో జెనెటిక్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి 10 లక్షల డాలర్ల(రూ.84 కోట్లు) నగదు బహుమతి అందనుంది. డిసెంబర్ 10న ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా వీరు అవార్డు అందుకోనున్నారు. వీరితో వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న వారి సంఖ్య 227కు చేరుకోనుంది.
మానవ శరీరంలోని అన్ని కణాలు ఒకే జన్యువులను కలిగి ఉన్నప్పటికీ.. కండరాలు, నరాల కణాలు వంటి వివిధ రకాల కణాలు వేర్వేరు విధులను నిర్వహిస్తాయి. జన్యు నియంత్రణ కారణంగా ఇది సాధ్యమవుతుంది. ఇది కణాలకు అవసరమైన జన్యువులను మాత్రమే ‘ఆన్’ చేయడానికి అనుమతిస్తుంది. ఆంబ్రోస్, రువ్‌కున్‌ల మైక్రోఆర్‌ఎన్‌ఏల ఆవిష్కరణ ఈ నియంత్రణ జరగడానికి కొత్త మార్గాన్ని వెల్లడించింది. మానవులతో సహా జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి.. ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడంలో వారి ఆవిష్కరణ ముఖ్యమని నోబెల్ అసెంబ్లీ పేర్కొంది.
గత సంవత్సరం కాటలిన్ కారికో, డ్రూ వీస్‌మాన్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. న్యూక్లియోసైడ్ బేస్ మోడిఫికేషన్‌లకు సంబంధించిన ఆవిష్కరణలకు ఈ గౌరవం లభించింది. ఈ ఆవిష్కరణ కరోనా వైరస్ (COVID-19)కి వ్యతిరేకంగా సమర్థవంతమైన mRNA వ్యాక్సిన్‌ల అభివృద్ధిలో సహాయపడింది. ఇప్పటివరకు వైద్యశాస్త్రంలో 227 మంది నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్దంతి రోజైన డిసెంబర్ 10న జరిగే వేడుకల్లో గ్రహీతలకు బహుమతితో పాటు, లక్ష డాలర్లను అందజేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com