Gaza: ఉత్తర గాజాలో ఆకలి చావులు .. WHO చీఫ్‌ భావోద్వేగం

Gaza: ఉత్తర గాజాలో ఆకలి చావులు .. WHO చీఫ్‌ భావోద్వేగం
పోషకాహార లోపం కూడా

ఉత్తర గాజాలో పిల్లలు ఆకలితో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది తో బాధపడుతున్నారని తెలిపారు. 2023 అక్టోబరు తర్వాత ఉత్తర గాజాలోని అల్‌-అవ్దా, కమల్‌ అద్వాన్‌ ఆస్పత్రులను సందర్శించిన WHO సిబ్బంది అక్కడి వివరాలను టెడ్రోస్‌ అధనామ్‌కు నివేదించింది. దీంతో ఆయన అక్కడి వివరాలను పేర్కొంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఉత్తర గాజాలో ఆహారలేమి సమస్య తీవ్రరూపం దాల్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు. ఆహారం లేక పది మంది పిల్లలు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్లో పోషకాహార లోపం కూడా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. దాడులతో అస్పత్రులు కూడా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా అల్‌-అవ్దా ఆస్పత్రిలో పరిస్థితులు భయకరంగా ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రికి చెందిన భవనాల్లో ఒకటి ధ్వంసమయ్యిందని చెప్పారు. ఉత్తర గాజాను ఇంధన, ఆహార, ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తోందని వెల్లడించారు. దాదాపు 3 లక్షల మంది శుద్ధి చేయని జలాలతోనే నెట్టుకొస్తున్నారని తెలిపారు. కమల్‌ అద్వాన్‌ ఆస్పత్రిలో పోషకాహార లోపం, డీహైడ్రేషన్‌తో 15 మంది పిల్లలు మృత్యువాత పడ్డారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. సరిహద్దు నగరమైన రఫాలోని దక్షిణ భాగంలో 16 మంది పిల్లలు చనిపోయారని పాలస్తీనా అధికార వార్త ఏజెన్సీ వాఫా పేర్కొంది.

గాజా పట్టీలో 5 లక్షల 76 వేల మంది ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని ఐరాసకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. ఉత్తర గాజాలో రెండేళ్లలోపు ఉన్న ప్రతీ ఆరుగురు పిల్లల్లో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పారు. ఈ ఆకలి చావులన్ని మానవ ప్రేరేపితమని ఐరాస అనుబంధ సంస్థ యునిసెఫ్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ అన్నారు. ఈ చావులను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు . అమెరికా శనివారం 38 వేలకు పైగా ఆహార ప్యాకెట్లను సైనిక విమానాల ద్వారా జార విడిచింది. వివిధ దేశాలు విమానాల ద్వారా మానవతా సాయాన్ని జార విడుస్తున్న అవి సరిపోవడం లేదని సహాయక బృందాలు చెబుతున్నాయి. మరోవైపు ఐరాస అనుబంధ సంస్థ UNRWA చీఫ్‌ ఇజ్రాయెల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థను గాజా నుంచి వెళ్లగొట్టడానికి ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story