North korea: ఉత్తర కొరియాలో లక్షలమందితో ర్యాలీ
ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్ లో వేలాదిమంది రోడ్ల మీదకు వచ్చారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ మార్చ్ చేపట్టారు. కొరియా యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
దాదాపు లక్షా 20వేల మంది ప్రజలు ప్యాంగాంగ్ వీధుల్లోకి వచ్చారు. కొరియా యుద్ధం ప్రారంభమై 73ఏళ్లు అయిన సందర్భంగా వారు భారీగా ప్రదర్శనలు నిర్వహించారని స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రదర్శనల్లో కార్మికులు, యువత, విద్యార్థులే ప్రధానంగా వున్నారు. రాజధానిలోని మే డే స్టేడియం వద్ద, నగరంలోని వివిధ ప్రాంతాల్లో వీరు ప్రదర్శనలు నిర్వహించారు.ఉత్తర కొరియాను సమూలంగా తుడిచిపెట్టేందుకు అమెరికా చేపట్టిన యుద్ధానికి ఎప్పటికైనా ప్రతీకారం తీర్చుకుంటామని వారు ప్రతిజ్ఞ చేశారు.మొత్తం లక్షా 14వేలుమంది పట్టే సామర్ధ్యం కలిగిన స్టేడియం లోపల ఉన్న జనం ఫోటోలను ప్రభుత్వ మీడియా ప్రచురించింది. మొత్తం అమెరికా భూభాగం మా కాల్పుల పరిధిలోనే వుంది, అమెరికా ఒక శాంతి విధ్వంసకర్త అంటూ రాసిన ప్లకార్డులను వారు పట్టుకున్నారని తెలిపింది.
కొరియా మొత్తాన్ని ఏకం చేయాలనే ప్రయత్నంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాపై దండెత్తింది. 1950 జూన్ 25న ఆరంభమైన ఈ యుద్ధం మూడేళ్ల పాటు సాగింది. యుద్ధంలో దాదాపు 20లక్షల మంది చనిపోయారు. శాంతి ఒప్పందం కుదరకపోవటంతో కాల్పుల విరమణ ఒప్పందంతోనే ఆనాటి యుద్ధం విరమించినా ఉత్తర, దక్షిణ కొరియాలు ఇప్పటికీ సాంకేతికంగా యుద్ధం చేస్తున్నాయి. ఉత్తర కొరియా లక్ష్యంగా అమెరికా ఇతర దేశాలతో కలిపి మిలటరీ చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అమెరికా దురాక్రమణ వైఖరి నేపథ్యంలో సైనికంగా ఆయుధాలు సమకూర్చుకోవడం అవసరమని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశ మిలటరీని ఆధునీకరిస్తామని కూడా ఆయన అన్నారు.
మొదటిసారిగా సైనిక నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు గత నెలలో ఉత్తర కొరియా చేసిన ప్రయత్నం విఫలమైంది. అయినా కానీ ఈ ఉపగ్రహ ప్రయోగం పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ దేశాలలో తీవ్ర భయందోళనలు, గందరగోళ పరిస్థితులు సృష్టించింది. త్వరలోనే రెండోసారి ఉపగ్రహ ప్రయోగం వుంటుందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు .
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com