North Korea: కే-పాప్‌ మ్యూజిక్‌ విన్నాడని బహిరంగంగా ఉరి

North Korea: కే-పాప్‌ మ్యూజిక్‌ విన్నాడని బహిరంగంగా ఉరి
X
ఉత్తర కొరియాలో దారుణం

దక్షిణ కొరియా పాప్‌ మ్యూజిక్‌ వినడం, సినిమాలు చూసి వాటిని షేర్‌ చేసినందుకు 22 ఏళ్ల యువకుడిని ఉత్తర కొరియా బహిరంగంగా ఉరి తీసింది. దక్షిణ కొరియా మ్యూజిక్ విన్నాడని, సినిమాలు చూశాడని ఆరోపిస్తూ ఉత్తర కొరియాలో 22 ఏళ్ల యువకుడికి బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారు. 2022లో ఈ ఘటన జరగ్గా ఉత్తర కొరియా మానవహక్కుల సంఘం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్ హ్వాంఘ్వే ప్రావిన్స్‌కు చెందిన యువకుడు 70 కే-పాప్ (కొరియా పాప్యులర్) పాటలు వినడంతోపాటు మూడు సినిమాలు చూసిన కేసులో దోషిగా తేలడంతో అతడిని బహిరంగంగా ఉరితీశారు. సౌత్ కొరియా పాప్ కల్చర్‌ను నిషేధించే ‘రియాక్షనరీ ఐడియాలజీ అండ్ కల్చర్’ చట్టాన్ని యువకుడు ఉల్లంఘించినట్టు అభయోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అవి నిజమని తేలడంతో బహిరంగంగా మరశిక్ష అమలుచేశారు.

సౌత్ కొరియాను ఆగర్భ శత్రువుగా భావించే కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ హయాంలోనే ఇలాంటి చట్టాలు రూపొందగా, కిమ్ హయాంలో ఇవి మరింత తీవ్రరూపం దాల్చాయి. కె-పాప్, కె-డ్రామా అనేవి దక్షిణ కొరియా సినిమాలు, సంగీతానికి రూపాలు. ఇటీవల వీటిపై నార్త్ కొరియా యువత మనసు పారేసుకుంటోంది. జీవితంలో ఇలాంటి ఏ వినోదమూ లేకుండా ఇలా నిస్సారంగా బతకడం కంటే చావు మేలంటూ ఉత్తర కొరియా యువత బహిరంగంగానే చెబుతూ చట్టాలను ధిక్కరిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు తరచూ ప్రజల మొబైల్స్‌ను తనిఖీ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు.

నార్త్ కొరియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే.. పెట్టుబడిదారీ ఫ్యాషన్ పోకడలపై అక్కడ నిషేధం ఉంది. అంటే, కేశాలంకరణ, స్కిన్నీ జీన్స్, విదేశీ భాషలు ఉన్న టీషర్టులు ధరించడం, జుట్టుకు సంప్రదాయేతర రంగులు పూసుకోవడం, వధువు తెల్లని దుస్తులు ధరించడం, వరుడు వధువును మోసుకెళ్లడం, సన్ గ్లాసెస్ ధరించడం, మద్యం తాగేందుకు వైన్ గ్లాస్‌లను ఉపయోగించడం వంటివి అక్కడ తీవ్రమైన నేరాలు.

Tags

Next Story