WARNING: అణు దాడి చేస్తే కిమ్‌ పాలన అంతమే

WARNING: అణు దాడి చేస్తే కిమ్‌ పాలన అంతమే
ఉత్తరకొరియాకు దక్షిణ కొరియా తీవ్ర హెచ్చరికలు... అణు దాడి చేస్తే కిమ్ పాలన అంతమే అని స్ట్రాంగ్‌ వార్నింగ్‌

వరుస ప్రయోగాలతో ఉత్తర కొరియా (North Korea) కవ్విస్తున్న వేళ దక్షిణ కొరియా(south korea‌) కీలక వ్యాఖ్యలు చేసింది. కిమ్‌ ప్రభుత్వం ఇలాగే కవ్వింపు చర్యలకు దిగితే అది అణుదాడికి దారితీయొచ్చని వ్యాఖ్యానించింది. దక్షిణ కొరియా-అమెరికా కూటమిపై ఉత్తర కొరియా అణుదాడి చేస్తే.. తమ కూటమి నుంచి తీవ్రస్థాయి ప్రతిస్పందన వస్తుందని, దాని ఫలితంగా ఉత్తర కొరియా ప్రభుత్వం అంతమవుతుందని దక్షిణ కొరియా హెచ్చరించింది.

దక్షిణ కొరియా రక్షణకు కట్టుబడి ఉన్నామంటూ అమెరికా తన అధునాతనమైన జలాంతర్గామిని కొరియా ద్వీపకల్పానికి తీసుకువచ్చింది. దీనిపై కిమ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అమెరికా- దక్షిణకొరియా ఆయుధ విన్యాసాలతో తమను కవ్విస్తోందని.. అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని కిమ్‌ ప్రభుత్వం హెచ్చరించింది. తమ వద్ద అణ్వస్త్రాలు కూడా ఉన్నాయని గుర్తు చేసింది.


మరోవైపు అమెరికా జలాంతర్గామి రాకతో ఉత్తర కొరియా (North Korea) వరుస క్షిపణి ప్రయోగాలతో కొరియన్‌ పీఠభూమిలో (Korean Peninsula) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా కొరియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రం వైపు క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగాలు తెల్లవారుజామున జరిగినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది.

ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. అవి జపాన్‌ సముద్రంలో పడినట్లు దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో ప్యాంగాంగ్‌ (Pyongyang) వరుసగా క్షిపణులను ప్రయోగిస్తున్నది.

వరుస మిస్సైల్‌ ప్రయోగాలతో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న వేళ అణు క్షిపణులను ప్రయోగించే సామర్థ్యమున్న అమెరికా(USA) జలాంతర్గామిని ఇటీవల దక్షిణ కొరియా(South Korea) సమీపంలో నిలిపి ఉంచారు. 1980ల తర్వాత ఒక ఎస్‌ఎస్‌బీఎన్‌ ఆ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి.

బ్రిటన్, అమెరికా,యూరప్‌ దేశాలకు కిమ్ సోదరి కిమ్ యో జంగ్ ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు పంపింది. అమెరికా యుద్ధ విమానాలు తమ అంతరంగిక ప్రాంతాల్లోకి వచ్చినందుకు ఇలాంటి బాలిస్టిక్ ప్రయోగం చేశామని, మళ్లీ మా దేశ భూభాగాల్లోకి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించింది. ఆయా దేశాలు ఉత్తర కొరియాతో ఏ విధంగానైతే ప్రవర్తిస్తాయో అంతకంటే ధీటుగా సమాధానం చెబుతామని ఆమె హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story