Kim-Putin: ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధాలు

Kim-Putin: ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధాలు
10లక్షల ఫిరంగి గుండ్లు సరఫరా

ఉక్రెయిన్‌పై సైనికచర్య జరుపుతున్న రష్యాకు ఉత్తర కొరియా భారీగా ఆయుధ సాయం అందించినట్లు దక్షిణకొరియాకు నిఘా విభాగం అనుమానిస్తోంది. ఆగస్టు ఆరంభం నుంచి దాదాపు 10లక్షలకుపైగా ఫిరంగి గుండ్లను పంపినట్లు విశ్వసిస్తోంది. నిఘావిభాగం అధికారులతో సమావేశం తర్వాత దక్షిణ కొరియాకు చెందిన చట్టసభ సభ్యుడు యూ సాంగ్‌-బూమ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాను దీటుగా ఎదుర్కొనేందుకు రష్యా, ఉత్తర కొరియా కొంతకాలంగా తమ బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. సెప్టెంబర్‌లో కిమ్‌-పుతిన్‌ భేటీ కావటంతో రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు సరఫరా చేయనుందనే వార్తలు వెలువడ్డాయి. మాస్కోకు ఆయుధాలు ఇచ్చినందుకు ఉత్తర కొరియా అణ్వాయుధ సామర్థ్యం బలోపేతానికి అవసరమైన సాంకేతికతను పుతిన్‌ అందించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే రష్యాకు కిమ్‌ ఆయుధాలు సరఫరా చేశారన్న అమెరికా, దక్షిణ కొరియా ఆరోపణలను రష్యా, ఉత్తరకొరియా తోసిపుచ్చాయి.

ఉక్రెయిన్‌పై సైనికచర్య నిర్వహిస్తున్న రష్యా యుద్ధ సామర్థ్యం పెంపు కోసం కిమ్‌ ఆగస్టు ఆరంభం నుంచి 10 లక్షలకుపైగా ఫిరంగి గుండ్లను నౌకలు, ఇతర రవాణా మార్గాల ద్వారా పంపినట్లు దక్షిణకొరియా చట్టసభ సభ్యుడు యూ సాంగ్‌-బూమ్‌ తెలిపారు.ఉత్తర కొరియా పంపిన ఈ ఆయుధ సామగ్రి రష్యాకు 2నెలల యుద్ధ అవసరాలను తీర్చనున్నట్లు చెప్పారు. మాస్కో ఆయుధ అవసరాలను తీర్చేందుకు ప్యాంగ్‌యాంగ్‌లోని ఆయుధ ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు యూ సాంగ్‌-బూమ్‌ పేర్కొన్నారు. తాము పంపిన ఆయుధాలను ఎలా వాడాలనే విషయాన్ని రష్యా సైనికులకు చెప్పేందుకు అక్టోబర్‌లో ఉత్తర కొరియాకు చెందిన ఆయుధ నిపుణుల బృందం మాస్కో వెళ్లినట్లు కూడా యూ సాంగ్‌-బూమ్‌ తెలిపారు.


రష్యాకు చెందిన సున్నితమైన సాంకేతికత ఉత్తర కొరియాకు అందితే దాయాది దేశం నుంచి అణ్వాయుధాలతోపాటు క్షిపణి దాడుల బెడద మరింత పెరుగుతుందని దక్షిణ కొరియా ఆందోళన చెందుతోంది. అయితే మాస్కో సాంకేతిక సాయం ఉత్తరకొరియాలో కాలం తీరిన విమానాలను మెరుగుపర్చటం సహా సంప్రదాయ సామర్థ్యం పెంపునకు పరిమితం కానుందని దక్షిణ కొరియా చట్టసభ సభ్యుడు యూసాంగ్‌-బూమ్ తెలిపారు. ఉత్తర కొరియా తన మొదటి సైనిక నిఘా ఉపగ్రహ ప్రయోగం కోసం మాస్కో సాంకేతికత పొందుతున్నట్లు చెప్పారు. అమెరికా దక్షిణ కొరియా సైనిక కార్యకలాపాల పర్యవేక్షణకు, అణ్వాయుధ సామర్థ్యం గల తమ క్షిపణుల నుంచి ముప్పు మరింత పెంచేందుకు అంతరిక్ష నిఘా సామర్థ్యం కీలకమని కిమ్ భావిస్తున్నారు. అంతరిక్ష నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అవసరమైన సాంకేతికతను కోరేందుకే రష్యాలోని ప్రధాన ఉపగ్రహ ప్రయోగ కేంద్రంలో పుతిన్‌ను కిమ్‌ కలిసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story