ఉత్తర కొరియాలో ఆకలి చావులు

ఉత్తర కొరియాలో ఆకలి చావులు
కొనసాగుతున్న కోవిడ్ ఆంక్షలతో దుర్భరమైన ప్రజాజీవనం

ఉత్తరకొరియా తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సుమారు మూడు దశాబ్దాల కిందట ఎలాంటి తీవ్రమైన కరువును ఎదుర్కొన్నారో ఇప్పుడు మళ్ళీ ఆనాటి కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొవిడ్‌ -19 కారణంగా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సరిహద్దులు మూసివేయడం వల్ల ఆహార సరఫరా నిలిచిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

కోవిడ్ మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించింది. జనజీవనాన్ని స్థంబింప చేసి ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ అన్ని దేశాలు ఆ ప్రభావం నుంచి బయటపడ్డాయి ఒక్క ఉత్తర కొరియా తప్ప. ఎందుకంటే ఉత్తర కొరియా మాత్రం ఇంకా ఆంక్షల వలయంలోనే చిక్కుకుపోయింది. ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో కఠిన నిబంధనలు సడలించాయి. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్​ ఉన్ మాత్రం సరిహద్దులను ఇంకా తెరవనేలేదు. దీంతో ఆ దేశం తీవ్రమైన ఆహార సంక్షోభం ఎదుర్కొంటోందని, ప్రజలు సరైన తిండిలేక ప్రాణాలు కోల్పోతున్నారని వివిధ నివేదికలు చెబుతున్నాయి.

ప్యాంగ్యాంగ్‌ అనే గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల ఆకలిబాధతో మరణించినట్టుగా, స్థానిక మహిళ వెల్లడించినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది. అలాగే మరో గ్రామంలోనూ ఆకలితో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఓ గృహ నిర్మాణ కార్మికుడు తెలిపినట్టుగా సమాచారం. ఒకప్పుడు కొవిడ్‌తో ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డామని కానీ, ఇప్పుడు ఆకలి చావులకు వణికిపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తుండటం వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది.

అయితే తమ వారి ఆకలి బాధను చూడలేక కొందరు, ఇదే సమయంలో కాస్త డబ్బు సంపాదిద్దామని కొందరు మంది పొరుగుదేశం నుంచి అక్రమంగా ఆహార పదార్థాలను తరలించేందుకు యత్నించారు. వారి ప్రయత్నం ఫలించలేదు సరి కదా ఎవరూ అటువంటి చర్యలకు దిగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. కంచెలు కట్టేసారు. సరిహద్దులు దాటొద్దని పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి ప్రయత్నాలు చేసిన వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చివేయాలని గార్డులకు కూడా ఆదేశాలిచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ ఆకలికేకలు పేద, మరియు మధ్య తరగతి వారివి మాత్రమే. ఇది తీవ్ర ఆందోళనకరమని ఉత్తరకొరియా ఆర్థికవేత్త పీటర్‌ వార్డ్‌ పేర్కొన్నారు. ఆహార సంక్షోభం ఇంకా దిగజారితే.. పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయన్నారు. తమ దేశంలోని 2.6 కోట్ల మంది ప్రజలకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉత్తరకొరియాకు ఎప్పుడూ లేదు. తిండి గింజల ఉత్పత్తిలో చాలాకాలంగా వెనుకబడే ఉంది. అణ్వాయుధ కార్యక్రమాలపై ఎక్కువ శ్రద్ద చూపే కిమ్‌ ప్రజల ఆకలిచావులపై దృష్టి సారించటం లేదని,

ఇప్పటికైనా పొరుగు దేశాలతో వాణిజ్యం పునరుద్ధరించాలని మానవహక్కుల సంస్థ సీనియర్‌ పరిశోధకుడు లినా యూన్‌ సూచించారు. వ్యవసాయం అభివృద్ధికి తగిన సదుపాయాలు కల్పించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story