Kim Ju-ae: చైనా సైనిక కవాతుకు కుమార్తెతో కలిసి హాజరైన కిమ్ జోంగ్ ఉన్

Kim Ju-ae: చైనా సైనిక కవాతుకు కుమార్తెతో కలిసి హాజరైన కిమ్ జోంగ్ ఉన్
X
ఆమెను 'గౌరవనీయ కుమార్తె'గా అభివర్ణిస్తున్న ఉత్తర కొరియా మీడియా

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన రాజకీయ వారసురాలు ఎవరనే దానిపై మరోసారి బలమైన సంకేతాలు పంపారు. చైనాలో జరిగిన భారీ సైనిక కవాతుకు ఆయన తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు యేతో కలిసి హాజరయ్యారు. ఒక విదేశీ పర్యటనకు కిమ్ తన కుమార్తెను వెంట తీసుకురావడం ఇదే మొదటిసారి కావడంతో, ఆమెయే తదుపరి పాలకురాలు అనే ప్రచారానికి ఇది మరింత బలాన్నిచ్చింది.

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై చైనా సాధించిన విజయానికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో ఈ సైనిక ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కిమ్ నిన్న తన ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ రైలులో బీజింగ్ చేరుకున్నారు. రైలు దిగే సమయంలో ఆయన వెంటే కిమ్ జు యే కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కిమ్ తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేయడం ఇది కొత్తేమీ కాదు. 2022లో తొలిసారిగా ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రం వద్ద ఆమె కనిపించారు. ఆ తర్వాత 2023లో జరిగిన మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవ పరేడ్‌లో కూడా తండ్రితో పాటు పాల్గొన్నారు. అప్పటి నుంచి పలు కీలక అధికారిక కార్యక్రమాల్లో ఆమె కనిపిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో పాలన తన వారసుల చేతిలోనే ఉంటుందని చెప్పడానికే కిమ్ ఇలా చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆమె వారసురాలు అనే వాదనలకు ఉత్తర కొరియా అధికారిక మీడియా కూడా బలం చేకూరుస్తోంది. మొదట్లో ఆమెను 'ప్రియమైన కుమార్తె'గా పేర్కొన్న మీడియా, ఆ తర్వాత 'గౌరవనీయ కుమార్తె'గా అభివర్ణించడం మొదలుపెట్టింది. దేశంలో అత్యున్నత గౌరవం ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ విశేషణాన్ని వాడతారు. కిమ్ కూడా అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు 'గౌరవనీయ కామ్రేడ్'గా పిలవబడ్డారు. ఈ పరిణామాలన్నీ వారసత్వ ప్రచారాన్ని బలపరుస్తున్నాయి.

అయితే, ప్రస్తుతం కిమ్ జు యే వయసు 13 సంవత్సరాలే కావడంతో, వారసత్వ మార్పిడికి ఇంకా చాలా సమయం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దక్షిణ కొరియా నిఘా వర్గాల సమాచారం ప్రకారం, కిమ్‌కు ముగ్గురు సంతానం కాగా, వారిలో కిమ్ జు యే రెండో సంతానం. అయినప్పటికీ, ఆమెకే పాలనా పగ్గాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.

Tags

Next Story