Kim Jong Un : పుతిన్‌ను కలిసేందుకు...

Kim Jong Un : పుతిన్‌ను కలిసేందుకు...
ప్రత్యేక రైలులో రష్యాకు వెళ్తున్న కిమ్ జాంగ్-ఉన్‌

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం తెల్లవారుజామున రష్యాకు బయలుదేరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి ఆయుధ విక్రయాలపై కిమ్ జోంగ్ ముఖాముఖి చర్చలు జరుపుతారని ప్యోంగ్యాంగ్ వెల్లడించింది. ఆ దేశ రాజ‌ధాని ప్యోంగ్‌యాంగ్ నుంచి ర‌ష్యాకు ట్రైన్ బ‌య‌లుదేరింద‌ని, ఆ రైలులో కిమ్ జాంగ్ ఉన్న‌ట్లు ద‌క్షిణ కొరియా మీడియా పేర్కొన్న‌ది. అయితే, దీనిపై దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం, రక్షణశాఖ లేదా అక్కడి నిఘా వర్గాలు మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధం కోసం పుతిన్ ఉత్తర కొరియా నుంచి ఆర్టిలరీ షెల్స్ యాంటీ ట్యాంక్ క్షిపణులను కోరుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

కిమ్ తన సైనికులు, సీనియర్ వ్యక్తులతో కలిసి రష్యా వెళ్లారని కొరియన్ వర్గాలు తెలిపాయి. కిమ్ జోంగ్ ఉన్ పర్యటన సందర్భంగా పుతిన్‌తో సమావేశమై చర్చలు జరుపుతారని ఉత్తర కొరియా అధికారులు చెప్పారు. పుతిన్‌తో కిమ్‌ భేటీ కావడం ఇదే తొలిసారి కాదు. 2019లో ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలోని రష్యా నగరమైన వ్లాదివోస్తోక్‌లో రష్యా అధ్యక్షుడితో కిమ్‌ భేటీ అయ్యారు. ఆ సందర్భంలోనూ విలాసవంతమైన రైలులో 20 గంటలు ప్రయాణించి వ్లాదివోస్తోక్‌ చేరుకున్నారు. ఈసారి కూడా ఆ నగరంలోనే ఇరు నేతల భేటీ ఉండొచ్చని సమాచారం. కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కిమ్ ఏ దేశంలోనూ ప్రయాణించలేదు. సుమారు 3 సంవత్సరాల తరువాత కిమ్ తొలిప్రయాణం ఇది.


మ‌రో వైపు ఉత్త‌ర కొరియాపై అమెరికా ఆరోప‌ణ‌లు చేసింది. ర‌ష్యాకు కిమ్ ఆయుధాల‌ను అందిస్తున్న‌ట్లు అగ్ర‌రాజ్యం పేర్కొన్న‌ది. ప్రైవేటు మిలిట‌రీ వాగ్న‌ర్ గ్రూపున‌కు ఉత్త‌ర కొరియా ఆయుధాలు అమ్మిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా సైనిక లాజిస్టిక్స్, ఆయుధాల నిల్వలు తగ్గుతూనే ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద రష్యా రూపొందించిన పదివేల ఫిరంగి షెల్స్, రాకెట్లు ఉన్నాయి. అందువల్ల, పుతిన్ వీటిని దేశం నుండి పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. యుద్ధం అంతం లేకుండా సాగుతుంది కాబట్టి చర్చల కోసం ఇది యునైటెడ్ స్టేట్స్‌పై ఒత్తిడి తెస్తుందని విమర్శకులు భావిస్తున్నారు. ప్రతిఫలంగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు రష్యా నుండి ఇంధనం, ఆహార ధాన్యాలు, అధునాతన ఆయుధ సాంకేతికతను డిమాండ్ చేస్తారు. ఉత్తర కొరియా కూడా రష్యాకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తోంది. యునైటెడ్ స్టేట్స్‌కు కౌంటర్ పవర్‌గా తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రపంచ వేదికపై దాని ఒంటరి ఇమేజ్‌ను మార్చడానికి ప్రయత్నిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story