North Korea : యుద్ధానికి సిద్ధం?

North Korea : యుద్ధానికి సిద్ధం?
సైనిక జనరల్‌ను తొలగించిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ఆ దేశ సైనిక టాప్‌ జనరల్‌ను పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారు. యుద్ధానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికా, దక్షిణ కొరియా చేపట్టబోయే సంయుక్త సైనిక విన్యాసాలపై కిమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్లు ఆ దేశ వార్తా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. ఇందులో భాగంగా టాప్‌ సైనిక జనరల్‌ను తొలగించిన కిమ్‌ ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారు. చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌గా ఉన్న పాక్‌-సు-ఇల్‌ స్థానంలో కొత్త జనరల్‌గా రి యాంగ్‌ గిల్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.


సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ సమావేశంలో పాల్గొన్న కిమ్‌.. శత్రువులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని సైనికాధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని, సైనిక సన్నాహాలను వేగవంతం చేయాలని సూచించినట్లు తెలిపింది. ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికా, దక్షిణ కొరియా చేపట్టబోయే సంయుక్త సైనిక విన్యాసాలపై కిమ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియాలో తయారైన కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టాలని, దళాలను సిద్ధం చేయాలని సైన్యాన్ని కిమ్‌ ఆదేశించినట్లు తెలిపింది. గతవారం ఆయుధ కర్మాగారాలను సందర్శించిన కిమ్‌.. క్రూజ్‌ క్షిపణి ఇంజిన్లు, మానవరహిత గగనతల వాహనాల నిర్మాణలను త్వరితం చేయాలని అధికారులకు సూచించారు.


అలాగే, భారీ దాడులకు ఉపయోగించే రాకెట్లను, కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణినీ ఆయన పరిశీలించారు. వాటితోపాటు ఆయుధ కర్మాగారాల్లో రైఫిళ్ల పనితీరును కిమ్‌ స్వయంగా పరిశీలించిన ఫొటోలను ఆ దేశ మీడియా విడుదల చేసింది. మరోవైపు ఉక్రెయిన్‌పై దాడికి రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరాల చేస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణలను రష్యా, ఉత్తర కొరియాలు కొట్టిపారేశాయి. రష్యాతో ఆయుధ సహకార ఒప్పందాల కోసమే కిమ్‌ ఆయుధ కర్మాగారాలను సందర్శించారని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరకొరియా ఏర్పడి సెప్టెంబర్‌ 9 నాటికి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా అప్పుడు జరిగే మిలటరీ పరేడ్‌ ఏర్పాట్లను కూడా కిమ్‌ పర్యవేక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story