KIM: విధ్వంస రచనకేనా?

KIM: విధ్వంస రచనకేనా?
త్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఉత్తరకొరియా నియంత కిమ్‌ భేటీ.. ఆయుధ ఒప్పందం కోసమే అని అమెరికా అనుమానం

ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్ ఉన్‌ రష్యా పర్యటనకు వెళ్లనున్నారనే వార్త ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా ఆయుధాల కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్న వేళ కిమ్.. పుతిన్‌ను కలిసేందుకు మాస్కో వెళ్లనున్నారని అమెరికా అధికారి తెలిపారు. ఈనెలాఖరులోనే కిమ్ రష్యా వెళ్లనున్నట్లు చెప్పారు. అయితే పుతిన్ , కిమ్ ఎప్పుడు, ఎక్కడా సమావేశం అవుతారనే విషయంపై గోప్యత పాటిస్తున్నారు. దీనిపై ఎలాంటి సమాచారం లేదని సంబంధిత అధికారులు తెలిపారు. ఉత్తర కొరియాకు సమీపంలో ఉన్న పసిఫిక్ పోర్టు సిటీ వ్లాదివొస్టోక్‌లో కిమ్‌, పుతిన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు ఆ అమెరికా అధికారి చెప్పారు.


రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు గతనెలలో ప్యాంగ్యాంగ్‌లో పర్యటించి ఆయుధ కొనుగోలు కోసం ఉత్తరకొరియాతో చర్చలు జరిపినట్లు అమెరికా జాతీయ భద్రతామండలి అధికార ప్రతినిధి తెలిపారు. రష్యాతో దౌత్య సంబంధాలు సహా ఆయుధ చర్చలు కొనసాగించాలని ఉత్తరకొరియా నియంత కిమ్ భావిస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని చెప్పారు. రష్యాతో ఆయుధ చర్చలు నిలిపివేయాలని, రష్యాకు ఆయుధాలు విక్రయించబోమన్న హామీకి కట్టుబడి ఉండాలని అమెరికా జాతీయ భద్రతామండలి అధికార ప్రతినిధి ఉత్తర కొరియాకు విజ్ఞప్తి చేశారు. రష్యా-ఉత్తర కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు మాస్కో రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు ఇప్పటికే ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో గతేడాది రష్యాకు ఉత్తరకొరియా రాకెట్‌లను, మిస్సైల్‌లను సరఫరా చేసింది.

మరోవైపు తమ దేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు తొలగిస్తేనే.. తిరిగి ధాన్య ఒప్పందంలోకి చేరతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తేల్చి చెప్పారు. ఈ మేరకు పుతిన్ తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌తో చర్చించారు. యుద్ధం కొనసాగుతున్న కారణంగా నల్లసముద్రం మీదుగా ఉక్రెయిన్-రష్యా వ్యవసాయ ఉత్పత్తుల సురక్షిత రవాణాకు సంబంధించి గతంలో ఐక్యరాజ్యసమితి, తుర్కియే మధ్యవర్తిత్వంతో ధాన్య ఒప్పందం కుదిరింది.


తమ దేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మాత్రం పాశ్చాత్య దేశాలు ఆటంకం కలిగిస్తున్నాయని రష్యా పేర్కొంది. అనంతరం జులైలో ఆ ఒప్పందం నుంచి వైదొలగింది. ఈ నేపథ్యంలో మాస్కోను బుజ్జగించేందుకు, ఒప్పందం పునరుద్ధరించేందుకు ఎర్డొగాన్‌.. రష్యా వచ్చి పుతిన్‌తో చర్చలు జరిపారు. ఈ సమస్యకు ఒక పరిష్కారం త్వరలోనే కనుగొంటామని అని తుర్కియే అధ్యక్షుడు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story