OCEAN GATE: టైటానిక్ సాహస యాత్ర నిలిపివేత

టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు ఆసక్తి చూపే ఔత్సాహికులకు ఓషన్ గేట్ కంపెనీ పెద్ద షాక్ ఇచ్చింది. టైటానిక్ శకలాల వద్దకు తీసుకెళ్లే సాహసయాత్రను నిలిపేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన టైటాన్ జలాంతర్గామి తీవ్ర విషాదం తర్వాత ఈ యాత్రకు సంబంధించిన కార్యకలాపాలను నిలిపి వేస్తున్నట్లు ఓషన్‌గేట్ సంస్థ ప్రకటించింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఇకపై తమ సంస్థ చేపట్టే అన్ని శోధన, వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో ఓషన్ గేట్ పేర్కొంది. వీటికి కారణాలను మాత్రం వివరించలేదు.
అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాల వద్దకు తీసుకువెళ్లే సాహసోపేతమైన యాత్రను ఓషన్ గేట్ సంస్థ నిర్వహిస్తోంది. సముద్ర గర్భంలో దాదాపు 13వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ శిథిలాలను చూసి వచ్చేందుకు జలాంతర్గామికి సుమారు ఏడు గంటల సమయం పడుతుంది. ఈ యాత్ర కోసం ఒక్కో వ్యక్తి 2 లక్షల 50వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఇటీవల టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓషన్ గేట్ సంస్థ సీఈఓ స్టాక్టన్ రష్, పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్‌తో పాటు ఆయన కుమారుడు సులేమాన్, యూఏఈలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నౌకాదళ అధికారి పాల్ హెన్రీ మృతి చెందారు. యాత్రకు బయలుదేరిన కొద్దిసేపటికే.... టైటాన్ జలాంతర్గామి అదృశ్యమైంది. చివరికి జలాంతర్గామి పేలి అందులోని పర్యాటకులు మరణించారు. సముద్ర గర్భంలో అధిక పీడనం కారణంగా టైటాన్ మినీ జలాంతర్గామి విచ్ఛిన్నం అయినట్లు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అమెరికా కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్ అండ్ లాబ్రడార్ ప్రావిన్సులో సెయింట్ జాన్స్ ఓడరేవుకు టైటాన్ జలాంతర్గామి శకలాలను తీసుకొచ్చారు. ఈ క్రమంలో మానవ అవశేషాలుగా అనుమానిస్తున్న భాగాలను నిపుణులు సేకరించారు. ఈ అవశేషాలను అమెరికాకు చెందిన వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.
సబ్ మెర్సిబుల్ నిర్మాణం అట్లాంటిక్ లోతుల్లో ప్రయాణానికి అనుకూలం కాదని.. నిపుణులు ఎప్పుడో తేల్చేశారు. పైగా వీడియో గేమ్‌ల తరహా రిమోట్ కంట్రోల్‌తో టైటాన్‌ను కంట్రోల్ చేయించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ టైటాన్‌తోనే టూరిజం వైపు మొగ్గు చూపించి ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com