TRUMP: ట్రంప్‌ను భయపెడుతున్న "అక్టోబర్ 10"

‘నేను ఏం చేసినా, ఎంత చేసినా వాళ్లు నాకు ఆ పురస్కారం ఇవ్వరు’’.. ఓ సారి ట్రూత్‌లో పోస్ట్.. ‘‘ఇప్పటికే నాకు శాంతి పురస్కారం రావాల్సింది. కానీ ఇంకా ఇవ్వలేదు’’.. మరో వ్యాఖ్య... ‘‘నా పేరు ఒబామా అయితే.. 10 సెకన్లలో నోబెల్ వచ్చేదేమో’’.. ఇంకోసారి ట్రంప్ విసుర్లు.. దీనిని బట్టి నోబెల్ శాంతి బహుమతి రావాలని ట్రంప్ ఎంతలా కోరుకుంటున్నారో చెప్పేందుకు.. ఇప్పుడు ట్రంప్‌ను అక్టోబర్ 10 భయం వెంటాడుతోంది. ఎందుకంటే ఆ రోజు నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించనున్నారు. దీంతో ట్రంప్ టెన్షన్‌తో వణికిపోతున్నారని వైట్ హౌస్ వర్గాల టాక్.
‘నోబెల్ శాంతి బహుమతి ’ని అందుకోవడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరాటపడుతున్నారు. ప్రపంచ ‘శాంతికాముకుడి’ని అనిపించుకోవాలన్న ఆయన కల, ఆకాంక్ష రోజురోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. అందుకోసం ఆయన మిత్ర బృందం కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరి ట్రంప్ కల నెరవేరుతుందో లేదో కానీ ఆయన టెన్షన్ మాత్రం బాగా పెరిగిపోయింది. తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ కొన్నాళ్లుగా డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిస్తున్నారు. ట్రంప్ నోబెల్ కల ఇప్పుడు అమెరికాకు తలనొప్పిగా మారింది. అవార్డు వస్తుందో, రాదో తెలియదు కానీ, అధ్యక్షుడిగా అనవసర విభేదాలు, వెక్కిరింతలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అక్టోబర్ 10న నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించనున్నారు. ఈనేపథ్యంలో ట్రంప్ టెన్షన్ పెరిగిపోయి.. ఏకంగా ఆ బహుమతి ఇచ్చే కమిటీని కూడా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు.
ఇవ్వాల్సిందే అంటున్న పాక్ నేతలు
ట్రంప్‌నకు నోబెల్ ప్రైజ్ దక్కాలని బల్లగుద్ది వాదించే వారిలో పాక్ నేతలు ముందున్నారు. ట్రంప్ ఆరాటాన్ని గమనించిన పాక్ సైన్యాధిపతి మునీర్ దానిని తమకు అనుకూలంగా మలుచుకొన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులను కడుపులో పెట్టి చూసుకొంటున్న తమ దేశం నుంచి నోబెల్ బహుమతికి నామినేషన్ పంపించారు. భారత్-పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. ఫలితంగా పాక్‌కు అవసరమైన నిధులు, సాయం వంటివి తెచ్చుకోగలుగుతున్నారు. ఇటీవల శ్వేతసౌధం సందర్శన వేళ ఇజ్రాయెల్ నుంచి వెళ్లిన నోబెల్ నామినేషన్ పత్రాన్ని నెతన్యాహు స్వయంగా ట్రంప్‌నకు బహూకరించారు. శాంతి బహుమతికి సమస్య రాకూడదని నెతన్యాహు ఖతార్‌కు ముక్తసరిగా క్షమాపణలు చెప్పి.. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకొన్నారు.
ఇవ్వొద్దంటున్న అమెరికన్లు
ఇతర దేశాల వారు మద్దతు ఇవ్వడం లేదని ట్రంప్ అంటున్నారు కానీ స్వదేశంలో కూడా అనుకూలత లేదు. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు కాదని 76 శాతం అమెరికన్లు అనుకుంటున్నారు. న్యూ వాషింగ్టన్ పోస్ట్ - ఇప్సాస్ పోల్ ఈ విషయం తెలిపింది. కేవలం 22 శాతం ఆయనకు మద్దతు ఇచ్చారు. రిపబ్లికన్లలోనే 49 శాతం మంది మద్దతు ఇవ్వగా.. మరో 49 శాతం మంది వ్యతిరేకిస్తుండటం గమనార్హం. ‘‘నాకు ఇప్పటికే నాలుగైదు సార్లు ఈ పురస్కారం రావాల్సింది. కానీ వాళ్లు నాకు ఇవ్వరు. కేవలం లిబరల్స్‌కు మాత్రమే ఇస్తారు (నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న డెమోక్రటిక్ నేతలను ఉద్దేశిస్తూ) అని ఓసారి ట్రంప్ మీడియాతో అన్నారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com