Israel-Hamas: గాజాలో ఆరుగురు బందీల మృతదేహాలు లభ్యం

ప్రకటించింన ఇజ్రాయెల్‌

హమాస్‌ నిర్బంధంలో ఉన్న ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ ఆదివారం ప్రకటించింది. వీరిని కాపాడేందుకు తమ సైన్యం గాజాకు చేరుకోవడానికి కొద్ది సేపటి ముందు వీరిని హమాస్‌ ఉగ్రవాదులు హత్య చేశారని తెలిపింది. దీంతో ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలకు ఇజ్రాయెలీలు పిలుపునిస్తున్నారు. 10 నెలల నుంచి జరుగుతున్న యుద్ధాన్ని ముగించి, హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నవారిని సజీవంగా తీసుకురావడంలో నెతన్యాహు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెతన్యాహు స్పందిస్తూ, బందీలను హత్య చేయడంతో హమాస్‌ ఉగ్రవాద సంస్థకు కాల్పుల విరమణ ఒప్పందం అక్కర్లేదని రుజువైందన్నారు. వారిని వేటాడి అంతమొందిస్తామని ప్రతినబూనారు. హమాస్‌ ఉగ్రవాదులు గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి, సుమారు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

ఇజ్రాయెల్‌ సైన్యం చేస్తున్న ఆపరేషన్లపై ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు స్పందిస్తూ.. బందీలను తిరిగి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ క్రమంలో భారీగా ప్రాణనష్టం జరగడం తననెంతో బాధిస్తుందన్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, అరబ్‌ దేశాలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. కాల్పుల విరమణ చర్చలు త్వరలోనే మొదలవుతాయనే వార్తల నేపథ్యంలో బందీల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ పరిణామం హమాస్‌కు ఎదురుదెబ్బలా కనిపిస్తున్నప్పటికీ.. కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయెల్‌పై మరింత ఒత్తిడి పెంచేలా కనిపిస్తోందని తెలుస్తోంది.

గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు పాల్పడిన హమాస్‌.. దాదాపు 250 మందిని కిడ్నాప్‌ చేసి, బందీలుగా గాజాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. వీరిలో సుమారు 100 మందికిపైగా చర్చల్లో భాగంగా విడుదల చేయగా.. మరికొందరు చనిపోయారు. మరో 110 మంది ఇప్పటికీ హమాస్‌ మిలిటెంట్ల చేతిలో బందీలుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, కిడ్నాప్‌ చేసినప్పుడు సజీవంగా ఉన్నారని బందీల కుటుంబీకుల తరఫున పోరాడుతున్న ఓ సంఘం పేర్కొంటుండగా.. ఇజ్రాయెల్‌ దాడుల్లోనే కొందరికి గాయాలయ్యాని, మరికొందరు మరణించారని హమాస్‌ చెబుతోంది.

Tags

Next Story