Omicron Variant: డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ డేంజర్ కాదు : అమెరికా సైంటిస్ట్‌లు

Omicron Variant (tv5news.in)
Omicron Variant: ప్రపంచాన్ని ఒమిక్రాన్ వణికిస్తున్న వేళ.. ఒక వార్త కాస్త ఊరటనిస్తోంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మాధిరిగానే థర్డ్ వేవ్ తప్పదన్న వార్తల నేపథ్యంలో.. కొంచెం తీపి కబురు చెప్పారు అమెరికా శాస్త్రవేత్తలు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ డేంజర్ కాదని స్పష్టం చేశారు. దీనికి ఫుల్ క్లియరెన్స్ ఇవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నా.. ఇప్పటి వరకు వచ్చిన రీసెర్చ్ రిజల్ట్స్ మాత్రం ఇదే చెబుతున్నాయని ప్రపంచానికి చల్లని వార్త చెప్పారు.
కరోనా ఫస్ట్ వేవ్.. అమెరికాలో ఎంతటి ప్రళయం సృష్టించిందో అందరికీ తెలుసు. లక్షలాది ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. న్యూయార్క్ లాంటి నగరం అయితే కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయింది. ఈ అనుభవాల నేపథ్యంలో ఒమిక్రాన్‌పై ముందునుంచే అప్రమత్తంగా ఉంది అగ్రరాజ్యం. ప్రముఖ సైంటిస్ట్ ఆంటోనీ ఫౌచీ లాంటి వాళ్లతో వైరస్ సామర్థ్యంపై డే వన్ నుంచి రీసెర్చ్‌లు చేయించింది. ఇప్పడు ప్రాథమికంగా ఇది డెల్టా కంటే డేంజర్ కాదన్న నిర్ణయానికి వచ్చింది.
దీనిపై ప్రకటన చేసిన ఫౌచీ.. డెల్టా కంటే ఒమిక్రాన్ తక్కువ ప్రమాదకరంగా కనిపిస్తుందన్నారు. ఇప్పటి వరకు వచ్చిన రీసెర్చ్‌ల రిపోర్ట్‌లను బట్టి ఒమిక్రాన్.. వ్యాధి తీవ్రతను ఎక్కువగా కలిగిస్తుంది అనడానికి ఆధారాలు లేవన్నారు. తీవ్ర అనారోగ్యాన్ని కలిగించదనే స్థిర అభిప్రాయానికి వచ్చేముందు.. కొంచెం జాగ్రాత్తలు పాటించడం మంచిదని సూచించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఫౌచీ.. చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్రికా దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను.. అమెరికా ఎత్తివేసే ఆలోచనకు వచ్చింది. త్వరలోనే ఆంక్షలు ఎత్తివేస్తూ బైడెన్ ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.
అమెరికా వార్త ప్రపంచానికి కాస్త ఊరటనిస్తే.. దానికి విరుద్ధంగా మాట్లాడుతోంది సింగపూర్ హెల్త్ డిపార్ట్‌మెంట్. కరోనా డెల్టా, బీటా వేరియంట్ల కంటే.. ఒమిక్రాన్ అధికంగా వ్యాపిస్తుందంటున్న సింగపూర్ సైంటిస్ట్‌లు.. దీంతో రీ-ఇన్ఫెక్షన్ ముప్పు కూడా ఎక్కువ అని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న టీకాలు.. ఈ కొత్త వేరియంట్‌ను సమర్థవంగా ఎదుర్కొంటున్నాయని.. దీని వల్లే వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయని వివరించారు. మొత్తంగా ప్రపంచానికి ఒమిక్రాన్ డేంజర్ బెల్స్ మోగించిన వేళ.. ఈ రిపోర్ట్‌లు ఊపిరిపీల్చుకునేలా చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com