Sri Lanka : శ్రీలంకలో ఒక్కరోజుకు సరిపడా పెట్రోల్ మాత్రమే నిల్వ

Sri Lanka : శ్రీలంకలో ఒక్కరోజుకు సరిపడా పెట్రోల్ మాత్రమే నిల్వ
Sri Lanka : శ్రీలంక ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పెట్రోల్ పూర్తిగా అడుగంటింది.

Sri Lanka : శ్రీలంక ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పెట్రోల్ పూర్తిగా అడుగంటింది. కేవలం ఒక్కరోజుకు సరిపడా పెట్రోల్ మాత్రమే నిల్వ ఉంది. పెట్రోల్‌ దిగుమతి చేసుకుందామన్నా అవసరమైన డాలర్లు లేని పరిస్థితి శ్రీలంకది. కొలంబో హార్బర్‌ బయట మూడు షిప్పుల్లో ఆయిల్‌ ఎదురు చూస్తున్నా, డాలర్లు చెల్లించే స్తోమత ప్రభుత్వం దగ్గర లేకుండా పోయింది.

కాగా చరిత్రలో ఎన్నడూ చూడని ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. దాదాపు 2.2 కోట్ల మంది అక్కడి ప్రజలు ఆహారం, ఇంధనం, మెడిసిన్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రికార్డ్ స్థాయిలో ద్రవ్యోల్బణంతోపాటు ఎక్కువ సేపు కరెంట్ కోతలను జనాలు అనుభవిస్తున్నారు. 1.4 మిలియన్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.

తీవ్ర సంక్షోభం దరిమిలా శ్రీలంక కొత్త ప్రధాని రణిల్‌ విక్రమసింఘే దాదాపు చేతులెత్తేశారు. ఇప్పటికే దివాలా తీసిన దేశంలో రాబోయే రోజుల్లో.. మరిన్ని కష్టాలు తప్పవని లంక పౌరులకు ముందస్తు సంకేతాలు పంపించారు. ఇప్పుడున్న ఆర్థిక క‌ష్టాల‌ను అధిగ‌మించాలంటే 75 మిలియ‌న్ డాల‌ర్లు అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. శ్రీలంక ఎయిర్ లైన్స్‌ను ప్రైవేటీక‌ర‌ణ చేస్తున్నట్లు ప్రక‌టించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన విక్రమసింఘే... ప్రస్తుతం ఒకరోజుకు సరిపోయే పెట్రోల్‌ నిల్వ మాత్రమే ఉందని, రానున్న నెలల్లో తమ జీవితాల్లో అతిపెద్ద కష్టాలు ఎదుర్కోబోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

పెట్రోల్‌ నిల్వలే కాక కరెటుకు కటకట తప్పకపోవచ్చు. శ్రీలంకలో చమురు ద్వారానే అధికంగా కరెంట్‌ ఉత్పత్తి జరుగుతుంది. దీంతో ఇక‌పై 15 గంటల వ‌ర‌కూ విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంతరాయం కలనుంది. విద్యుత్ సంక్షోభాన్ని అధిగ‌మించేందుకు నిధుల స‌మీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని విక్రమ సింఘే పేర్కొన్నారు. తీవ్ర సంక్షోభంతో 22 మిలియన్ల మంది అష్టకష్టాలు పడుతున్నారని, పరిస్థితిని చక్కదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదని పేర్కొన్నారు.

మహింద రాజపక్స తొలగింపు అనంతరం గత గురువారం శ్రీలంక కొత్త ప్రధానిగా విక్రమ సింఘే పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ప్రధానిగా చేసిన అనుభవం ఉండడంతో లంకేయులు ఆయనపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో విక్రమ సింఘే కూడా చేతులెత్తేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story