Bangladesh: ఉస్మాన్ హాదీ హత్యతో అట్టుడుకుతోన్న బంగ్లాదేశ్

భారత వ్యతిరేక నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇక హిందువులపై దాడులకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం దగ్గర హిందూ సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి.
ఇదిలా ఉంటే తాజాగా యూనస్ ప్రభుత్వంపై ఉస్మాన్ హాదీ సోదరుడు ఒమర్ హాదీ సంచలన ఆరోపణలు చేశాడు. ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ ఎన్నికలను అడ్డుకునేందుకే తన సోదరుడు ఉస్మాన్ హాదీని హత్య చేయించారని ఒమర్ హాదీ ఆరోపించాడు. ఉస్మాన్ హాదీని ప్రభుత్వమే చంపించి.. ఇప్పుడేమో ఈ సమస్యను సాకుగా చూపించి ఎన్నికల నిర్వహణను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యాలు చేశాడు.
ఎన్నికలు జరగకుండా ఏదొక అంతరాయం కలిగించాలన్న దుర్బుద్ధితో యూనస్ ప్రభుత్వంలోని ఒక వర్గమే తన సోదరుడిని చంపించిందని తెలిపాడు. ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలు సజావుగా జరగాలని తన సోదరుడు కోరుకున్నాడని.. దయచేసి ఎన్నికల వాతావరణానికి ఎవరూ ఎలాంటి భంగం కలిగించొద్దని అధికారులకు విజ్ఞప్తి చేశాడు.
ఓ వైపు ఎన్నికల నిర్వహణ జరిగిస్తూనే హంతకులపై విచారణ జరిపించాలని అభ్యర్థించాడు. ఇప్పుడు వరకు కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతిని అధికారులు చూపించలేదని పేర్కొన్నాడు. ఉస్మాన్ హాదీకి మాత్రం న్యాయం జరగకపోతే.. మీరు కూడా ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సోదరుడు ఏం సంస్థకు.. విదేశీ యజమానులకు తలొగ్గకపోవడం వల్లే హత్యకు గురయ్యాడని చెప్పుకొచ్చాడు. 30 రోజుల్లో హంతకులను అరెస్ట్ చేయాలని అల్టిమేటం విధిస్తున్నట్లు హెచ్చరించాడు.
ఈనెల 18న ఉస్మాన్ హాదీ హత్యకు గురయ్యాడు. దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో గాయాలు పాలయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో దేశంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

