Afghanistan earthquakes : ఎటు చూసినా శవాల గుట్టలే

Afghanistan earthquakes : ఎటు చూసినా శవాల గుట్టలే
2,445కు చేరిన మృతుల సంఖ్య

అఫ్ఘానిస్థాన్‌లో సంభవించిన వరుస భారీ భూకంపం అనంతరం హెరాత్ నగరంలో ఎటు చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. భూకంప మృతుల సంఖ్య 2,445కి పెరిగిందని, గాయపడిన వారి సంఖ్య 2,000 కంటే ఎక్కువని అఫ్ఘాన్ విపత్తుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సయీఖ్ స్వయంగా ప్రకటించారు. మొదట 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా తర్వాత మరో 6 శక్తిమంతమైన ప్రకంపనలు కుదిపేశాయి. శనివారం రాత్రి వరకు 300 మందికి పైగా మరణించినట్టు గుర్తించారు. కొందరు రాత్రంతా అయినవాళ్ల మృతదేహాల వద్ద రోదిస్తూ ఉండిపోగా.. మరికొందరు కుటుంబ సభ్యుల జాడ తెలియక చీకట్లో శిథిలాల మధ్య గడిపారు. తెల్లారి వెలుగొచ్చాక అతికష్టంమీద శిథిలాలు తొలగించి.. మిగతావారి మృతదేహాలను వెలికితీశారు. అప్పటినుంచి మట్టిదిబ్బలు తొలగించినప్పుడల్లా శవాలు బయట పడుతూనే ఉన్నాయి.


భూకంపం కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద నలిగిపోయి మరికొన్ని మృతదేహాలు ఉండిపోయాయి. మిలిటరీతోపాటు స్వచ్ఛంద సంస్థలకు చెందిన బృందాలు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పటికే 7బృందాలను పంపామని, ఇతర ప్రావిన్సుల నుంచి కూడా మరికొన్ని బృందాలు వస్తున్నాయని అప్ఘాన్‌ రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీ ప్రతినిధి ఇర్ఫానుల్లా తెలిపారు. వైద్యులు హెరాత్‌ ప్రాంతీయ ఆస్పత్రి వద్ద 5 శిబిరాలు ఏర్పాటు చేసి గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ, రిలీఫ్ కోసం ఆహారం, తాగునీరు, మందులు, బట్టలు, టెంట్లు అత్యవసరంగా అవసరమని ఖతార్‌లోని తాలిబాన్ రాజకీయ కార్యాలయ అధిపతి సుహైల్ షాహీన్ మీడియాకు తెలిపారు. భూకంపం వచ్చిన ప్రాంతాల్లో శోధన, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.


ఐక్యరాజ్య సమితి వలస విభాగం వైద్యులు, అంబులెన్సులను పంపింది. భూకంపం ప్రభావిత ప్రాంతాలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని పాకి స్థాన్‌ తెలిపింది. క్రికెట్‌ ప్రపంచ కప్‌లో తనకు వచ్చే ఫీజు మొత్తం భూకంప బాధితులకు విరాళంగా ఇస్తానని అఫ్ఘాన్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ ప్రకటించారు.

అప్ఘానిస్థాన్ తరచూ భూకంపాలకు గురవుతుంది. హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో, ఇది యురేషియన్ భారతీయ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉంటుంది. గత సంవత్సరం జూన్ లో అఫ్ఘానిస్థాన్ లోని పక్తికా రాష్ట్రంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో ఏకంగా వెయ్యి మందికిపైగా ప్రజలు మృతిచెందారు. 10 వేలకు పైగా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story