మ్యాజిక్ చేస్తా.. నేనే గెలుస్తా: ట్రంప్ ధీమా

మ్యాజిక్ చేస్తా.. నేనే గెలుస్తా: ట్రంప్ ధీమా
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, ఒక వర్గం ప్రజలు మాత్రం ట్రంప్‌కే మళ్లీ పట్టం కట్టాలని భావిస్తున్నారు.

అమెరికాలో ఎన్నికలు.. ఈసారి ఎవరు గెలుస్తారో.. మళ్లీ ట్రంపే అధ్యక్షపీఠాన్ని అధిరోహిస్తారేమో.. ఏం మ్యాజిక్ చేశారో 2016 ఎన్నికల్లో ఆయనే విజేతగా నిలిచారు.. ఈ సారి కూడా అలాంటి అల్లా ఉద్ధీన్ అద్భుత దీపం ట్రంప్ దగ్గర ఉండే ఉంటుంది. మాటల ద్వారా మంచివాడనిపించుకోకపోయినా, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, ఒక వర్గం ప్రజలు మాత్రం ట్రంప్‌కే మళ్లీ పట్టం కట్టాలని భావిస్తున్నారు. ట్రంప్ అనుకున్నది చేస్తారు, చేసి చూపిస్తారు అని అధిక శాతం అమెరికా పౌరులు ట్రంప్‌కి ఓటు వేయడానికే మొగ్గు చూపుతున్నారని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.

పోలింగ్‌కు గడువు మరి కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుకుంది. కరోనా వేళ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసేందుకు భయపడుతున్న అమెరికన్లు బ్యాలెట్, ఈమెయిల్ ద్వారా రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అమెరికాలో మొత్తం 17 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉండగా.. అందులో దాదాపు 5 కోట్ల 90 లక్షల మందికి పైగా ఓటు వేశారు. మునుపెన్నడూ నమోదు కాని రీతిలో టెక్సాస్ రాష్ట్ర ప్రజలు ముందస్తు ఓటింగ్ హక్కును వినియోగించుకున్నారు. 2016లో నమోదైన ఓట్ల కంటే ఈ ఏడాది ఎక్కువ ఓట్లు నమోదైనట్లు ఫ్లోరిడా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న స్వతంత్ర అమెరికా ఎన్నికల ప్రాజెక్టు వెల్లడించింది. అయితే ముందస్తు ఓటింగ్ ప్రక్రియలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ వైపు మొగ్గు చూపుతున్నా.. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ఇదంతా తలకిందులవుతుందని ట్రంప్ ధీమాతో ఉన్నారు.

టెక్సాస్ రాష్ట్రంలో 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించినా.. ఈసారి బైడెన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ రాష్ట్ర ఓటింగ్ ప్రక్రియపై క్విన్నిపియాక్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పోల్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మెయిల్, బ్యాలెట్ ద్వారా ముందస్తుగా ఓటు వేసేవారిలో 63 శాతం బైడెన్‌కు, 31 శాతం ట్రంప్‌కు మద్దతిస్తున్నామని తెలిపారు. కాగా ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేస్తామని చెప్పిన వారిలో 62 శాతం మంది ట్రంప్‌నకు, 32 శాతం మంది బైడెన్‌కు మద్దతిస్తున్నామని వెల్లడించారు.

కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడడంలో ట్రంప్ విఫలమైనందున మా ఓటు బైడెన్‌కే అని 44 శాతం మంది వెల్లడించగా, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించగల సామర్థ్యం ట్రంప్‌కే ఎక్కువ ఉందని అధిక శాతం అభిప్రాయపడుతున్నారు. యువరక్తం బైడెన్ వైపు మొగ్గు చూపితే, 45 ఏళ్లు దాటిన వారు ట్రంప్ వైపే ఉన్నారని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఇక న్యూమరాలజీ ప్రకారం కూడా ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారని చెబుతున్నాయి. కారణం వివరిస్తూ.. ట్రంప్ పుట్టిన తేదీ 14.06.1946. ఇందులోని అంకెల్ని ప్రత్యేక పద్ధతిలో లెక్కిస్తే చివరకు వచ్చేది 22. ఇది ట్రంప్ లైఫ్ పాత్ నెంబరని.. ఈ నెంబర్ వచ్చిన వ్యక్తులకు భారీ విజయాలు ఖాయమని చెబుతున్నారు. వీరికి ఆత్మవిశ్వాపం కూడా ఎక్కువని అంటున్నారు. అంతే కాకుండా వ్యాపారాల్లోనూ, రాజకీయాల్లోనూ ఈ నెంబరు గల వ్యక్తులు బాగా రాణిస్తారని వారి అంచనా.

ఒక డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ జాతకాన్ని పరిశీలిస్తే.. ఆయన పుట్టిన తేదీ 20.11.1942. ఇందులోని నెంబర్లను లెక్కిస్తే చివరకు తేలేది 2. ఇది అత్యంత తక్కువ శక్తి ఉన్న సంఖ్యగా వారు చెబుతున్నారు. ఇలాంటి నెంబరు వచ్చే వ్యక్తులు ఎంత పని చేసినా గుర్తింపు పొందలేరని అంటున్నారు. ఇక ఎన్నికలు జరుగుతున్న సంవత్సరాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే 2020 సంఖ్య కూడా ట్రంప్ కే అనుకూలంగా ఉందని తేల్చి చెబుతున్నారు. ఏతా వాతా ఏ లెక్కలు కరెక్ట్ అన్నది మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story