AFGHAN: దిక్కులేక స్వదేశానికి తిరిగి వస్తున్న ఆఫ్గాన్లు

AFGHAN: దిక్కులేక స్వదేశానికి తిరిగి వస్తున్న ఆఫ్గాన్లు
స్వదేశానికి భారీగా తిరిగివస్తున్న అఫ్గాన్లు.. ఒక్క నెలలోనే 74 వేల మంది రాక.. విదేశాల్లో వలసదారులపై దారుణాలు..

ఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టగానే కఠిన ఆంక్షలు, చిన్న తప్పులకే ఉరి శిక్షలు, కొరఢా దెబ్బలు ఇవ్వనీ ఊహించుకుని వేలమంది ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు. ఇరాన్‌, పాకిస్తాన్‌ సహా చాల దేశాలకు శరణార్థులుగా తరలివెళ్లారు. ఇలా వెళ్లిన వలసదారులు అందరూ తిరిగి వారి మాతృదేశానికి చేరుకుంటున్నారు. ఈ ఏడాది మే నెలలోనే దాదాపుగా 74 వేల మంది ఆఫ్ఘన్ వలసదారులు ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. మే నెలలో 74 వేల మంది ఆఫ్ఘన్ వలసదారులు ఇరాన్ నుంచి సిల్క్ రోడ్ ద్వారా స్వదేశానికి చేరుకున్నారని తాలిబాన్ అధికారులు తెలిపారు.


కనీసం 74 వేల 360 మంది మే నెలలో ఆఫ్గన్‌కు వచ్చారని.. ఇందులో 11 వందల ఆరు కుటుంబాలు ఉన్నాయని నిమ్రోజ్ ప్రావిన్స్ అధిపతి అబ్దుల్లా రియాజ్ తెలిపారు. గత రెండు వారాలుగా ఇరాన్, పాకిస్థాన్‌ నుంచి ఆఫ్గన్‌కు తిరిగి వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగినట్లు వివరించారు. పాకిస్థాన్‌ నుంచి 230 ఆఫ్ఘన్ కుటుంబాలు తిరిగి స్వదేశానికి చేరుకున్నాయి. ఆతిథ్య దేశాలలో వేధింపులు, ఏకపక్ష నిర్బంధం సహా ఆఫ్ఘన్ జాతీయులను బహిష్కరించడం వంటి వివిధ కారణాలతో వీరంతా మళ్లీ తిరిగి స్వదేశానికి వస్తున్నారు.





ఆఫ్ఘన్ శరణార్థులు ఏకపక్ష నిర్బంధం, జైలు శిక్ష, బలవంతంగా బహిష్కరించడం వంటి తీవ్ర సవాళ్లతో ఆతిథ్య దేశాల్లో వేదనకు గురవుతున్నారని తాలిబన్‌ అధికారులు తెలిపారు. తమ పాలన మెరుగవుతున్నందుకే వారు తిరిగి స్వదేశానికి వస్తున్నారని వెల్లడించారు. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న వెంటనే దేశం విడిచి వెళ్లేందుకు వేల మంది పౌరులు కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాల వెంట పరుగెడుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అక్కడి పరిస్థితులను ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించాయి. దాదాపు అన్ని దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి సొంత దేశాలకు తరలించాయి.



తాలిబాన్ రాజ్యం అంటే వణికిపోయిన అఫ్గాన్ ప్రజలు ప్రాణభయంతో విదేశాలకు పరుగులు పెట్టారు. ఇళ్లను వదిలేసి.. దొరికిన కాడికి లగేజీ తీసుకుని, పెళ్లాం పిల్లలతో ఇరాన్‌, పాకిస్థాన్‌ సహా చాలా దేశాలకు వెళ్లిపోయారు. ఒక్కో విమానంలో వందలాది మంది ప్రయాణించారు. కొంతమందైతే ఏకంగా విమానాల మీదకే ఎక్కి నిలబడి ప్రయాణించారు.

Tags

Next Story