Fire Explodes: లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు..

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ను కార్చిచ్చు చుట్టుముట్టింది. దీంతో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇక్కడ సంపన్న వర్గాలు నివసించే ది పాలిసాడ్స్ ఏరియాలో కార్చిచ్చు చెలరేగినట్లు సమాచారం. దాదాపు 3000 ఎకరాలను దహనం అయినట్లు తెలుస్తుంది. దీంతో 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. చాలా మంది తమ సామగ్రి, వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. మరోవైపు ప్రజలు ఒక్కసారిగా రోడ్ల పైకి రావడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జాం అయింది. ఇక్కడ కొండలపై ఉన్న రహదారులు ఇరుగ్గా ఉండటంతో పాటు గాలులు ఎక్కువగా వీస్తుండటంతో మంటలు తొందరగా వ్యాపిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇక్కడ గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అయితే, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ మంటల వల్ల చాలా ఇళ్లు కాలిపోయాయి.. మరి కొన్ని చోట్ల కూడా కార్చిచ్చులు పుట్టొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 13,000 నిర్మాణాలకు కార్చిచ్చు ముప్పున్నట్లు లాస్ ఏంజెల్స్ అగ్నిమాక అధికారి క్రిస్టీన్ క్రావ్లీ వెల్లడించారు. బెవర్లీ హిల్స్, హాలీవుడ్ హిల్స్, మలిబు, శాన్‌ఫెర్నాండో ప్రాంతాలకు కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉందని సూచించారు. ఇప్పటికే ఇక్కడి ఫైర్ అలర్ట్ లెవల్స్‌ను పెంచినట్లు తెలిపారు. దాదాపు 62,000 మంది ప్రజలు కొన్ని గంటలుగా విద్యుత్తు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మంటలను ఆర్పటానికి హెలికాప్టర్లు, బుల్డోజర్లను అధికారులు తెప్పిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com