Imran Khan: పాపం ఇమ్రాన్‌... గంటల్లోనే ఆనందం ఆవిరి

Imran Khan: పాపం ఇమ్రాన్‌... గంటల్లోనే ఆనందం ఆవిరి
మూడేళ్ల శిక్షను రద్దు చేసిన ఇస్లామాబాద్‌ హైకోర్టు.. వెంటనే ఇమ్రాన్‌ మెడకు మరో కేసు...

తోషాఖానా అవినీతి కేసు(Toshakhana case)లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌( Imran Khan)కు భారీ ఊరట దక్కింది.తోషాఖానా కేసులో కింద కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను( three-year sentence) ఇస్లామాబాద్ హైకోర్టు( Islamabad High Court) సస్పెండ్ చేసింది. తన శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ట్రయర్‌ కోర్టు విధించిన మూడేళ్ల శిక్షను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమిర్‌ ఫారూఖ్‌(Chief Justice Aamir Farooq ), జస్టిస్‌ తారీఖ్‌ మహ్మద్‌ జహంగిరిలతో కూడిన ధర్మాసనం సస్పెండ్‌ చేసింది.

2018 నుండి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్( Pakistan Tehreek-e-Insaf) అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై దేశ సంపదను అక్రమంగా అమ్ముకున్నారన్న నేరంపై పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అటక్‌ జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఇదే కేసులో మరో ఐదేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా వీల్లేదని ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆ తీర్పును నిలిపివేయడంతో ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం లభించినట్లయింది.


మరోవైపు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్‍ Chief Justice Umar Ata Bandial‌) నేతృత్వంలోని జస్టిస్ మజహర్ అలీ అక్బర్ నఖ్వీ(Justice Mazahar Ali Akbar Naqvi), జస్టిస్ జమాల్ ఖాన్ మండోఖైల్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ కూడా తోషాఖానా కేసుకు వ్యతిరేకంగా పిటిషన్లను విచారణను పునఃప్రారంభించనుంది. అంతకుముందు తోషాఖానా కేసుపై వివిధ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు సెషన్స్ కోర్టు తీర్పులో లోటుపాట్లు ఉన్నాయని గమనించింది. నిందితులకు రక్షణ హక్కు కల్పించకుండా హడావుడిగా తీర్పు ఇచ్చారని ప్యానెల్‌ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ట్రయల్ కోర్టు తీర్పులో లోపాలున్నాయని అన్నారు.

మరోవైపు.. తోషాఖానా కేసులో శిక్షను రద్దు చేస్తూ ఇస్లామాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆనందం ఇమ్రాన్‌కు ఎక్కువసేపు నిలవలేదు. తోషఖానా కేసులో పడిన జైలు శిక్షను నిలిపివేస్తూ ఇస్లామాబాద్‌ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే మరో కేసు ఆయన మెడకు చుట్టుకుంది. తాజాగా ఇమ్రాన్‌ఖాన్‌పై పోలీసులు అధికారిక రహస్యాల చట్టం కింద సైఫర్‌ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న మాజీ ప్రధానిని.. నేడు కోర్టు ముందు హాజరు పరచనున్నారు. ఇమ్రాన్‌ రహస్యమైన దౌత్య అంశాలను దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు. ప్రధానిగా అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వాడుకున్నారని అందులో ఆరోపించారు.

Tags

Next Story