PAK CRISIS: తీవ్ర స్థాయిలో ఆర్థిక సంక్షోభం

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. శ్రీలంకను మించి అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి మారకపు విలువ 255 రూపాయలకు చేరింది. గత కొంతకాలంగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా నెట్టుకొస్తున్న పాక్.. కఠిన పొదుపు చర్యలకు సిద్ధమయింది. ఇందులో భాగంగా ఎంపీల వేతనాల్లో 15 శాతం కోత విధించింది. విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. మరోవైపు పాక్‌లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఆకలి చావులు తప్పవన్న భయాందోళనలు నెలకొన్నాయి. పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో పాక్ కష్టాలు.. మరింత పెరిగి శ్రీలంక కంటే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు వీలుగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి సులువుగా రుణాలు పొందేందుకు పాక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఐఎమ్ఎఫ్ సూచన మేరకు పాకిస్థాన్ ద్రవ్యమారకపు రేటుపై నిబంధనలను సడలించింది. ఫలితంగా ఒక్కరోజులోనే పాక్ రూపాయి 24 రూపాయల మేర క్షీణించింది. డాలరుతో పాక్ రూపాయి మారకపు విలువ 255 రూపాయలకు పడిపోయింది. తాము నిధులివ్వాలంటే పాకిస్థాన్‌లో కరెంటు సబ్సిడీలను ఉపసంహరించాలనీ, అంతర్జాతీయ మార్కెట్ ధరలను బట్టి గ్యాస్ ఛార్జీలను నిర్ణయించాలనీ, పాక్ రూపాయి మారక విలువను మార్కెట్ ఆధారంగా నిర్ణయించాలనీ, లెటర్ ఆఫ్ క్రెడిట్లపై నిషేధం తొలగించాలని ఐఎమ్ఎఫ్ గతంలో షరతులు పెట్టింది. ఇప్పుడు విడుదల చేయకపోతే 6.5 బిలియన్ డాలర్ల నిధులన్నీ రద్దయిపోతాయి. ఈ నేపథ్యంలోనే పాక్ కఠిన నిర్ణయాలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. షరతులకు అంగీకరించిన నేపథ్యంలో వచ్చే వారం తమ బృందం పాకిస్థాన్‌లో పర్యటిస్తుందని ఐఎమ్ఎఫ్ వెల్లడించింది. షరతుల అమలుపై అధికారులతో చర్చలు జరపడానికి ఐఎమ్ఎఫ్ బృందం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పాక్‌లో పర్యటిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మరోవైపు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్‌లో విదేశీ మారకపు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ఒక ప్యాకెట్ గోధుమ పిండి 3 వేల రూపాయలకు మించి ధర పలుకుతోంది. ఒకవేళ అంత మొత్తం చెల్లించేందుకు సిద్ధపడినా ఆహార పదార్థాలు దొరకడం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దేశం మొత్తం అంధకారంలో మగ్గుతోంది. దేశంలో విలయ తాండవం చేస్తున్న ఆహార, ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు గత 24 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాక్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను అమాంతంగా పెంచేసింది. ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ పొదుపు చర్యలపై దృష్టి పెట్టింది. ఎంపీల వేతనాల్లో 15 శాతం కోత పెట్టింది. వారి విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. గ్యాస్, విద్యుత్ ధరలు పెంచాలని నిర్ణయించింది. నిఘా సంస్థలకు విచ్చలవిడిగా నిధులు విడుదల చేయరాదని తీర్మానించింది. చమురు దిగుమతులు గుదిబండగా మారిన నేపథ్యంలో అన్ని స్ధాయిల్లో పెట్రోల్ వాడకాన్ని 30 శాతం తగ్గించుకోవాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com