అంతర్జాతీయం

Imran Khan : అవిశ్వాసాన్ని ఉపసంహరించుకుంటే అసెంబ్లీని రద్దు చేస్తా : ఇమ్రాన్‌ ఖాన్‌

Imran Khan : ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జాతీయ అసెంబ్లీలో చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది.

Imran Khan : అవిశ్వాసాన్ని ఉపసంహరించుకుంటే అసెంబ్లీని రద్దు చేస్తా :  ఇమ్రాన్‌ ఖాన్‌
X

Imran Khan: పాకిస్థాన్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జాతీయ అసెంబ్లీలో చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది.దీంతో స్పీకర్ సభను ఏప్రిల్‌ 3కు వాయిదా వేశారు. అదే రోజు ఇమ్రాన్ విశ్వాస పరీక్ష ఎదుర్కొంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బలపరీక్ష జరిగితే ఇమ్రాన్‌ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. ఈ రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు కీలక ప్రతిపాదన చేశారు ఇమ్రాన్‌ ఖాన్‌.

విపక్షాలు అవిశ్వాసాన్నిఉపసంహరించుకుంటే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తానని ఆఫర్‌ ఇచ్చారు. అయితే ఈ ఆఫర్‌ను ప్రతిపక్షాలు తిరస్కరించాయి. అవిశ్వాసానికి మొగ్గు చూపాయి. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ ప్రకటించింది. దీంతో జాతీయ అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. అయితే సభలో గందరగోళం ఏర్పడటంతో... సభను ఏప్రిల్‌ 3కు వాయిదా వేశారు స్పీకర్‌.

342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ - పీటీఐకి 155 మంది సభ్యులున్నారు. పీఎంఎల్ క్యూ సహా ఇతరుల మద్దతుతో ఆయనకు మద్దతిస్తున్నవారి సంఖ్య 164కు చేరింది. వాస్తవానికి మ్యాజిక్ నెంబర్ 172. ప్రతిపక్ష పీఎంఎల్‌ఎన్‌కు 84, పీపీపీ 56, ఎంఎం‌ఏ‌కు 15 మంది, ఇతరులు 22 మంది ఉన్నారు. వీరందరి బలం 177. మ్యాజిక్ నెంబర్‌ను మించి ప్రతిపక్షాల వద్ద బలముంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ జాతీయ భద్రత కమిటీ అత్యవసర సమావేశయ్యారు. సర్వీస్‌ చీఫ్‌లు, కీలక మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు, ఇతర నిఘా అధికారులు పాల్గొన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ జాతి నుద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలస్తోంది. ఈ ప్రసంగంలోనే తన రాజీనామాను ప్రకటించే అవకాశాలున్నాయి.

అటు ఇమ్రాన్ చివరి బంతి వరకూ ఆడతారంటున్నారు ఆ పార్టీ సభ్యుడు ఫవాద్ చౌదరి. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష నేత నవాజ్ నివాసంలో కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో మీడియాకూ పాత్ర ఉందంటున్నారు.మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వ్యవహారం పాక్‌ సుప్రీంకోర్టుకు చేరింది. ఇమ్రాన్‌పై అవిశ్వాసాన్నిఆపాలంటూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసేందుకు విదేశాల కుట్ర జరుగుతోందని, దీనిపై దర్యాప్తు చేసేందుకు ఆదేశాలివ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. మొత్తానికి ఏప్రిల్ 3న ఏం జరగుతుదోననే ఉత్కంఠ నెలకొంది.

Next Story

RELATED STORIES