Indo-Pak Love Story: నేపాల్ మీదుగా భారత్ లోకి... యువతి సాహసం

Indo-Pak Love Story: నేపాల్ మీదుగా భారత్ లోకి... యువతి సాహసం
నేపాల్ మీదుగా భారత్ లోకి పాక్ మహిళ; ప్రియుడిని పెళ్లి చేసుకోడానికి భారత్ లోకి అక్రమంగా ప్రవేశం


ప్రేమలో పడితే లోకాన్ని మర్చిపోతారు కొందరు. మరికొందరు సప్తసముద్రాలు దాటి పెళ్లి చేసుకుంటారు. ఆ కోవలోకే వస్తుంది ఈ భారత్-పాక్ జంట కథ. పాకిస్థాన్ కు చెందిన మహిళ తన ప్రియుడిని పెళ్లి చేసుకోడానికి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ములాయమ్ సింగ్ యాదవ్ (25) తరచుగా ఆన్ లైన్ లో 'లూడో గేమ్' అడుతుండేవాడు. గేమ్ ఆడుతున్నప్పుడు, పాకిస్థాన్ కు చెందిన 19 సంవత్సరాల ఇక్రా జీవని అనే అమ్మాయిని కలుసుకున్నాడు. ఇద్దరి మద్య స్నేహం చిగురించింది. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ములాయమ్ సింగ్ తో కలిసి జీవించాలని నిర్ణయించుకున్న ఇక్రా జీవని, నేపాల్ మీదుగా భారత్ కు చేరుకుంది. ఈ జంట బెంగళూరులోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో నివాసం ఉంటున్నారు. ములాయం సింగ్ యాదవ్ తన పేరును రవ యాదవ్ గా మార్చుకున్నాడు. ఇక్రా కోసం ఆధార్ కార్డును కూడా సంపాదించాడు. భారత పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేశాడు.

పాకిస్థాన్ లో నివసిస్తున్న తన ఫ్యామిలీతో మాట్లాడేందుకు ఇక్రా ప్రయత్నించగా, కేంద్ర నిఘా వర్గాలు ఇక్రాను గుర్తించాయి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ను అలర్ట్ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా భారత్ లోకి ప్రవేశించడంతో పాటు, నకిలీ పత్రాలు సంపాదించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ కేసులో యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్రాను FRRO అధికారులకు అప్పగించారు. తదుపరి విచారణ వరకు ఆమెను మహిళా స్టేట్ హోమ్ కు రిమాండ్ చేసి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story