Pakistan : కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకుడు ముషారఫ్

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముషారఫ్...దుబాయిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు పాకిస్థాన్‌ను నియంతలా పాలించిన ముషారఫ్ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. భారత్, పాక్ మధ్య కార్గిల్ యుద్ధానికి కుట్రలు సహా..మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య వరకు అనేక కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి..ఎమర్జెన్సీని విధించారు.
1964లో పాక్ సైన్యంలో చేరారు ముషారఫ్. 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో సెకండ్ లెఫ్టినెంట్‌గా పనిచేశారు. అఫ్గాన్ అంతర్యుద్ధంలోనూ కీలక పాత్ర పోషించారు. మిలిటరీలో చేరిన ఏడాదికే ముషారఫ్‌ను భారత సరిహద్దుల్లో విధులకు పంపారు.అదే సమయంలో భారత్- పాక్ మధ్య యుద్ధం జరిగింది. ఆ తర్వాత ముషారఫ్ స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో చేరారు.
1971 యుద్ధం సమయంలో ఎస్‌ఎస్‌జీ బెటాలియన్ కంపెనీ కమాండర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ మేజర్ జనరల్ స్థాయికి చేరారు. ఆ హోదాలో ఉన్నప్పుడు నాటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌తో కలిసి మిలిటరీ ఆపరేషన్స్‌కు డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.
భారత్, పాక్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకుడు ముషారఫ్. సరిహద్దుల్లోని సియాచిన్‌లో భారత పట్టును సహించని ముషారఫ్...1988-89 మధ్య కార్గిల్ చొరబాటుకు అప్పటి ప్రధాని బెనజీర్ భుట్టో ప్రతిపాదించారు. బెనజీర్ భుట్టోతో ముషారఫ్ అత్యంత సన్నిహితంగా ఉండేవారు.
1992-95 మధ్య పాక్-అమెరికా మధ్య జరిగిన అనేక ఉన్నత స్థాయి సమావేశాల్లో భుట్టోతో కలిసి ముషారఫ్ కూడా పాల్గొన్నారు. ఆ చొరవతోనే కార్గిల్ చొరబాటు ప్రతిపాదన చేశారు. అయితే, యుద్ధ పరిణామాలపై భయంతో భుట్టో వెనక్కి తగ్గారు. ఐతే ముషారఫ్ మాత్రం ఆ అంశాన్ని వదిలేయలేదు.
1999 మార్చి నుంచి మే మధ్య కార్గిల్ ప్రాంతంలోకి రహస్యంగా పాక్ సైన్యాన్ని జొప్పించారు. ఈ విషయాన్ని భారత్ గుర్తించడంతో రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలైంది. అయితే, ఈ విషయం అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌కు తెలియదు. కార్గిల్ యుద్ధ సమయంలో నాటి భారత ప్రధాని వాజ్‌పేయీ.. షరీఫ్‌కు ఫోన్ చేస్తే యుద్ధం గురించి తనకేమీ తెలియదని అన్నారని సమాచారం ఇచ్చారు.
ముషారఫ్ పాక్ సైన్యాధిపతి కావడానికి ప్రధాన కారణం నవాజ్ షరీఫ్. చీఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న కరామత్‌కు..ప్రధాని షరీఫ్‌కు మధ్య విబేధాలు రావడంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని షరీఫ్ సర్కార్ నిర్ణయించింది. దీంతో షరీఫ్ ముషారఫ్‌కు ఫోర్ స్టార్ జనరల్‌గా పదోన్నతి కల్పించి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్‌గా నియమించారు.
కార్గిల్ యుద్ధంతో ముషారఫ్, షరీఫ్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ముషారఫ్‌ను పదవి నుంచి తొలగించి ఆయన బాధ్యతలను ఖ్వాజా జియాయుద్దీన్‌కు అప్పగించాలని షరీఫ్ నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలియగానే ఆగ్రహానికి గురైన ముషారఫ్ 1999 అక్టోబరులో సైనిక తిరుగుబాటు చేసి షరీఫ్‌ను గద్దెదింపారు. దేశంలో సైనిక పాలన విధించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. షరీఫ్‌ను గృహ నిర్బంధం చేసి ఆ తర్వాత అరెస్టు చేశారు.
2001 జూన్‌లో ముషారఫ్ తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకుని యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. తర్వాత ఐదేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగారు. 2007లో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి రెండోసారి దేశ పగ్గాలు అందుకున్నారు. అయితే ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పాకిస్థాన్ సుప్రీంకోర్టు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు రానుందని పసిగట్టిన ఆయన.. తీర్పు వెలువడడానికి నాలుగు రోజులు ముందుగానే.. న్యాయవ్యవస్థను వంచించి.. ఉగ్రవాదాన్ని సాకుగా చూపి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. రాజ్యాంగాన్ని రద్దు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఇఫ్తికార్ ఎం ఛౌదురిని పదవి నుంచి తొలగించారు. తనకు అనుకూలంగా ఉన్న జస్టిస్ అబ్దుల్ హమీద్ దోగార్‌ను హుటాహుటిన చీఫ్ జస్టిస్‌గా నియమించారు. కొత్త న్యాయమూర్తి.. ముషారఫ్ ఎన్నికకు ఆమోదముద్ర వేయడంతో పరిస్థితులు సద్దుమణిగాయి.
2008లో అధికారంలో ఉన్న రెండు ప్రముఖ పార్టీలు ముషారఫ్‌కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. తన ఉద్వాసన తప్పదని భావించి దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ముషారఫ్. తర్వాత ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం.. ముషారఫ్ అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, లాల్ మసీదు మతపెద్ద అబ్దుల్ రషీద్ ఘాజీల హత్య కేసులోనూ ఆయనపై ఆరోపణలున్నాయి.
2007లో రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసినందుకు ఆయనపై దేశద్రోహం అభియోగాన్ని మోపారు. దీంతో 2008 నవంబరులో ఆయన లండన్‌కు పారిపోయారు ముషారఫ్. తర్వాత 2013లో పాక్‌కు తిరిగొచ్చిన ముషారఫ్..సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది.
2013లో ఆయనను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలివ్వగా..ముషారఫ్ పారిపోయి ఫామ్‌హౌజ్‌లో దాక్కొన్నారు. అయితే పోలీసులు అతడిని గృహనిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాత కోర్టుకు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. అయితే తనపై ఉన్న కేసుల్లో ఎప్పటికైనా శిక్ష తప్పదని భావించిన ముషారఫ్..చికిత్స పేరుతో 2016లో దుబాయి వెళ్లిపోయారు.
2007లో దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి అత్యవసర స్థితిని ప్రకటించినందుకు గానూ దేశద్రోహం కేసులో 2019లో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. ఆ సమయంలో కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముషారఫ్‌ను ఉరి తీయండి..అతడి డెడ్‌బాడీని పార్లమెంట్ ఎదురుగా ఉన్న డిస్క్వేర్ దగ్గరకు తీసుకు వచ్చి ప్రజలకు గుర్తుండిపోయేలా..మూడు రోజుల పాటు సర్కిల్‌లో వేలాడదీయండి అంటూ కామెంట్ చేసింది.
2016 నుంచి దుబాయిలోనే ఆశ్రయం పొందుతున్న ముషారఫ్...కొద్ది కాలంగా అమైలాయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com