Pakistan Actor: కరాచీ ఫ్లాట్‌లో పాక్ నటి హుమైరా మృతదేహం

పాకిస్థాన్ టీవీ నటి హుమైరా ఆస్గర్ అలీ మృతదేహాన్ని ఇటీవల కరాచీలోని ఓ ఫ్లాట్‌లో గుర్తించారు. ఆ నటి రెండు వారాల క్రితం మృతిచెందినట్లు తొలుత పోలీసులు అంచనా వేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆమె కనీసం 9 నెలల క్రితం మరణించి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆమె ప్రాణాలు కోల్పోయి ఉంటుందని స్థానిక మీడియా పేర్కొన్నది. శరీరం పూర్తిగా కుళ్లిపోయిందని కరాచీ సర్జన్ డాక్టర్ సుమయ్యా సయ్యిద్ తెలిపారు.
పోస్టు మార్టమ్ నిర్వహించిన తర్వాత ఆమె సుమారు 9 నెలల క్రితం మరణించినట్లు నిర్ధారణకు వచ్చారు. నటి హుమైరా కాల్ డేటా ప్రకారం ఆమె తన చివరి ఫోన్ కాల్ 2024 అక్టోబర్‌లో చేసిందన్నారు. తన ఫ్లాట్ పక్కింటివాళ్లు కూడా ఆమెను సెప్టెంబర్‌లో చూసి ఉంటామని చెప్పారు. బిల్లులు పెండింగ్‌లో ఉన్న కారణంగా.. 2024 అక్టోబర్‌లో హుమైరా ఇంటికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఇంట్లో ఉన్న ఆహారం కూడా కొన్ని నెలల క్రితమే పాడైపోయినట్లు నిర్ధారించారు.
తొలుత ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కటుంబసభ్యులు నిరాకరించినా చివరకు సోదరుడు రిసీవ్ చేసుకున్నారు. వెరిఫికేషన్ కోసం డీఎన్ఏ టెస్టు చేశారు. ఏడేళ్ల క్రితమే లాహోర్ నుంచి హుమైరా కరాచీకి మకాం మార్చిందని, కుటుంబానికి దూరంగా ఉంటోందని ఆమె సోదరుడు తెలిపాడు. కిరాయి చెల్లించడం లేదని ఇంటి యజమాని ఫిర్యాదు చేసిన తర్వాత.. హుమైరా ఉంటున్న ఫ్లాట్ తలపులను పోలీసులు తెరిచారు.
2015లో ఎంటర్‌టైన్మెంట్ పరిశ్రమలో తన కెరీర్‌ను మొదలుపెట్టిందామె. జస్ట్ మ్యారీడ్, ఇషాన్ ఫర్మోష్, గురు, చాల్ దిల్ మేరీ టీవీ షోల్లో నటించింది. జిలేబీ, లవ్ వ్యాక్సిన్ చిత్రాల్లోనూ నటించింది. తమాషా ఘర్ రియాల్టీ షోతో హుమైరా మరింత పాపులరైంది. 2023లో ఆమెకు బెస్ట్ ఎమర్జింగ్ టాలెంట్, రైజింగ్ స్టార్ అవార్డు దక్కింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com