PROJECT VISHNU: ‘‘ప్రాజెక్ట్ విష్ణు’’తో పాక్, చైనాలో వణుకు

ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ వ్యవస్ధను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది. అత్యాధునిక ఆయుధాలతో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. ఓ వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, కొత్తగా బంగ్లాదేశ్.. ఇలా భారత్ చుట్టూ శత్రు దేశాల ప్రమాదం పొంచి ఉన్న వేళ రక్షణ శాఖను శత్రు దుర్బేధ్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సరిహద్దు దేశాల దాడులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారత్ ఇటీవల కాలంలో తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ స్వదేశీ ఆయుధాల సత్తా పాకిస్తాన్, చైనాలకు తెలిసి వచ్చింది. ఇక ముందు కూడా ఈ రెండు దేశాలకు భయపడేలా భారత్ పెద్ద ప్రాజెక్టుకే శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో డీఆర్డీవో ఆధ్వర్యంలో 12 హైపర్సోనిక్ మిసైళ్లు రెడీ అవుతున్నాయి. దాడి చేయడం, రక్షణ సామర్థ్యాలపై దృష్టి పెట్టడం లక్ష్యంగా ఈ హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీని వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్టు విష్ణులో ఈ మిసైళ్ల తయారీని ప్రధానంగా చేపట్టారు. వీటితో పాటు మరిన్ని అత్యాధునిక ఆయుధాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో ఓ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికిల్ (హెచ్‌జీవీ), హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడంలో ప్రధాన లక్ష్యం.. అత్యంత వేగవంతమైన దాడి సామర్థ్యాలలో స్వావలంభన సాధించడం, అలాగే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడే శత్రువులను ఎదుర్కోవడానికి బలమైన రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడం అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో 3 దేశాలు- అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఈ సాంకేతికత ఉంది. భారత్ చేపట్టిన ప్రాజెక్టు కింద డెవలప్ చేస్తున్న మిస్సైల్స్ 1000 నుంచి 2000 కి.మీ బరువు ఉన్న సాంప్రదాయ లేదా అణు వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటాయి.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘‘ప్రాజెక్టు విష్ణు’’పై పని చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ‘‘హైపర్ సోనిక్ మిస్సైల్స్’’ని డెవలప్ చేస్తోంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతో వీటిని అభివృద్ధి చేస్తోంది. ఇది మొత్తం ఆసియాలోనే పవర్ బ్యాలెన్స్‌ని ఛేంజ్ చేయగలదు. ఈ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ET-LDHCM వంటి క్షిపణులు మాక్ 8 (సుమారు గంటకు 10,000 కి.మీ.) వేగాన్ని తాకగలవు. దీంతో భారత్ హైపర్ సోనిక్ క్షిపణులు ఉన్న అమెరికా, రష్యా, చైనా జాబితాలో చేరుతుంది.
శక్తివంతమైన దేశంగా భారత్
దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ సామర్థ్యం ఉన్న శక్తిమంతమైన దేశాల్లో మనదేశం ఒకటిగా నిలిచింది. మాక్ 5 (ధ్వని కన్నా ఐదు రెట్లు వేగం) కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఆయుధాలను హైపర్‌సోనిక్‌గా పేర్కొంటారు. ప్రస్తుతానికి ఇలాంటి హైస్పీడ్ క్రూయిజ్ మిసైళ్లను అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఏదీ ప్రపంచంలో లేదు. అలాంటి అత్యాధునిక 12 హైపర్సోనిక్ ఆయుధాలను ఆర్మీ, నేవీ, వాయుసేన కోసం డీఆర్డీవో అభివృద్ధి చేస్తోంది. దీనిలో మొట్టమొదటగా ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్(ఈటీ-ఎల్డీహెచ్సీఎం)ను ప్రాజెక్టు విష్ణులో భాగంగా రూపొందిస్తున్నారు. స్ర్కామ్‌జెట్ ఇంజిన్‌తో మాక్ 8 స్పీడ్‌ను అందుకునేలా దీనికి రూపకల్పన చేశారు. 2,500 కిలోమీటర్ల వరకు ఉన్న పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదని చెబుతున్నారు. 2030 కల్లా దీనిని సాయుధ బలగాల అమ్ములపొదిలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక మరో ప్రధానమైన ఆయుధం హెచ్‌జీవీ. స్ర్కామ్‌జెట్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ మిసైల్‌ను నవంబరు 2024లో డీఆర్డీవో పరీక్షించింది. యుద్ధనౌకలపై దాడి చేసేందుకు రూపొందించిన ఈ మిసైల్ రేంజ్ 1,500 కిలోమీటర్లు. 2030 కల్లా దీనిని కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయంలో ప్రాజెక్టు కుశ కింద ప్రత్యేక హైపర్సోనిక్ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారత్ కృషి చేస్తోంది. దాడి చేసే ఆయుధాలను రూపొందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సంకల్పించారు.
మరిన్ని అస్త్రాలు
యుద్ధ విమానాలు, నౌకల నుంచి కూడా ప్రయోగించే హైపర్సోనిక్ మిసైళ్లను డీఆర్డీవో అభివృద్ధి చేస్తోంది. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే వర్షన్ కూడా ప్రతిపాదనలో ఉంది. అంతేకాకుండా హైపర్సోనిక్ డ్రోన్లు, డెకాయ్‌లు కూడా రూపొందిస్తోంది. 2030 కల్లా సమగ్ర హైపర్సోనిక్ మిసైల్ అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అత్యంత వేగవంతమైన దాడి సామర్థ్యాలలో స్వావలంభన సాధించడం, అలాగే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడే శత్రువులను ఎదుర్కోవడానికి బలమైన రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడం భారత్ లక్ష్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయుధ వ్యవస్థతో పాక్-చైనా- బంగ్లాదేశ్ దాడులను సమర్థంగా తిప్పి కొట్టే అవకాశం ఉందని భారత రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత రక్షణ శక్తి కూడా పెరుగుతుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com