Pakistan Diplomat: పీక కోస్తామంటూ ప్రవాస భారతీయులకు పాక్ అధికారి బెదిరింపు

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. విదేశాల్లో సైతం భారత సంతతి ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. లండన్ లోని పాక్ ఎంబసీ ముందు నిరసన ప్రదర్శన చేపట్టిన భారత సంతతి ప్రజల పట్ల పాక్ అంబాసిడర్ దురుసుగా వ్యవహరించాడు. గొంతు కోస్తా నంటూ సైగలు చేయడంతో రాయబార కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా లండన్‌లోని భారతీయ ప్రవాసులు పాకిస్థాన్ రాయబార కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సమయంలో పాకిస్థాన్ డిఫెన్స్ అటాషెగా పనిచేస్తున్న తైమూర్ రహత్ అనే అధికారి బయటకు వచ్చి నిరసనకారులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. వారిని చూస్తూ గొంతు కోస్తున్నట్లు చేతితో సైగ చేయడం వివాదాస్పదమైంది.
గతంలో కూడా తైమూర్ రహత్ ఇలాంటి వివాదాస్పద చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 2019లో పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని వెంబడిస్తూ ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో చిక్కుకున్న భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను అవమానించేలా ఉన్న ఓ పోస్టర్‌ను ప్రదర్శిస్తూ ఆయన కనిపించినట్లు వార్తలు వచ్చాయి.
భారత నిరసనకారులను భయపెట్టేందుకే దౌత్యవేత్త ఉద్దేశపూర్వకంగా ఈ రెచ్చగొట్టే చర్యకు పాల్పడ్డారని పలువురు భావిస్తున్నారు. ఆయన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దౌత్యవేత్త స్థాయికి తగని రీతిలో వ్యవహరించిన తైమూర్ రహత్‌ను తక్షణమే వెనక్కి పిలిపించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com