Khawaja Muhammad : నకిలీ స్టోర్‌ను ప్రారంభించిన పాకిస్థాన్ రక్షణ మంత్రి !

పాకిస్థాన్ ప్రజా ప్రతినిధుల తెలివిలేని తనం మరోసారి బయటపడింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తామే విజయం సాధించామని విర్రవీగిన పాకిస్థాన్ అసలు రూపం బట్టబయలైంది. అక్కడి పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నాయో, ప్రభుత్వ పెద్దల పని తీరు ఎంత అజాగ్రత్తగా ఉందో ఈ ఒక్క ఘటనతోనే అర్థమవుతోంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ తాజాగా సియాల్కోట్‌లో ఒక పిజ్జా హట్ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి.. నవ్వుతూ ఫోటోలు దిగారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.
కానీ కథ అక్కడితో ఆగలేదు. కొద్దిసేపటికే అసలు నిజం బయటపడింది. ఆ స్టోర్ అసలైన పిజ్జా హట్ కాదని, పూర్తిగా నకిలీదని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. “ఈ స్టోర్‌కు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు” అని పిజ్జా హట్ పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు.. ఇది మా బ్రాండ్ పేరును తప్పుగా వాడుతోందని, తమ ప్రమాణాలు, నాణ్యత, భద్రతా నియమాలు ఏవీ పాటించడం లేదని స్పష్టం చేసింది. సాధారణంగా పిజ్జా హట్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్ ప్రారంభం అంటే పూర్తి అనుమతులు, రిజిస్ట్రేషన్, కఠిన నియమాలు ఉంటాయి. అలాంటిది ఒక నకిలీ స్టోర్‌ను దేశ రక్షణ మంత్రి స్వయంగా ప్రారంభించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. “ఒక మంత్రి కనీసం ఇది నిజమైన స్టోరేనా కాదా అని కూడా చూసుకోలేదా?” అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తాయి. కొందరు అయితే దీన్ని జోకులా తీసుకొని, తీవ్రంగా విమర్శలు చేశారు.
పిజ్జా హట్ పాకిస్థాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో అధికారికంగా కేవలం 16 పిజ్జా హట్ అవుట్‌లెట్లు మాత్రమే ఉన్నాయి. అందులో 14 లాహోర్‌లో, 2 ఇస్లామాబాద్‌లో ఉన్నాయి. సియాల్కోట్‌లో ఒక్క అధికారిక స్టోర్ కూడా లేదు. అయినా అక్కడ నకిలీ పిజ్జా హట్ పేరు పెట్టి వ్యాపారం నడుస్తుండటం, దాన్ని ఒక కేంద్ర మంత్రి ప్రారంభించడం అనేది నిజంగా నవ్వు తెప్పించే విషయం అయింది. ఈ ఘటనను కంపెనీ సీరియస్‌గా తీసుకుంది. తమ ట్రేడ్‌మార్క్‌ను దుర్వినియోగం చేస్తున్నారని సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై చాలా మందికి ఓ సందేహం వచ్చింది. ఒక దేశ రక్షణ మంత్రి నకిలీ స్టోర్‌ను గుర్తించలేకపోతే.. ఆయన చేసే ఇతర ప్రకటనలు, విజయాలపై చేసే వ్యాఖ్యలు ఎంతవరకు నమ్మదగినవి? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. పాకిస్థాన్ వాస్తవ పరిస్థితి ఏంటో ఈ పిజ్జా హట్ కథే చెప్పేస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
