Pakistan: పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రసంస్థకు మద్దతు.. మరోసారి బయటపడిన పాకిస్తాన్ నిజస్వరూపం..

పాకిస్తాన్‌కు ఉగ్రవాదానికి ఉన్న సంబంధాలను బయటపెట్టుకోవడంలో ఆ దేశం ఎప్పుడూ సిగ్గుపడటం లేదు. తాజాగా, పహల్గామ్ ఉగ్రవాడికి బాధ్యత వహించిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’’కు మద్దతు తెలుపుతోంది. ఏకంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కామెంట్స్ కొత్త వివాదానికి దారి తీశాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో నాన్-పర్మినెంట్ సభ్యుడిగా ఉన్న పాకిస్తాన్, పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూనే, ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ప్రస్తావనను నిరోధించింది. ఈ టీఆర్ఎఫ్, కరడుగట్టిన లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అనుబంధం సంస్థగా ఉంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు.
యూఎన్ఎస్‌సీ ప్రకటన నుంచి టీఆర్ఎఫ్ తొలగించాలని, ఉగ్రవాద దాడుల్ని, అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులుగా చిత్రీకరించాలని, లష్కరే తోయిబా ఉగ్రసంస్థను దౌత్యపరంగా రక్షించేందుకు లాబీయింగ్ చేసినట్లు ఇషాక్ దార్ అంగీకరించారు. ‘‘UNSC ప్రకటనలో TRF గురించి ప్రస్తావించడాన్ని మేము వ్యతిరేకించాము. ప్రపంచం రాజధానుల నుంచి నాకు కాల్స్ వచ్చాయి, కానీ పాకిస్తాన్ అంగీకరించలేదు’’ అని దార్ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. టీఆర్ఎఫ్ పేరును ఐక్యరాజ్యసమితి ప్రకటన నుంచి తొలగించడంలో పాకిస్తాన్ విజయం సాధించినట్లు చెప్పారు.
‘‘మేము TRF చట్టవిరుద్ధమని పరిగణించము. వారు పహల్గామ్ దాడిని చేశారని రుజువు చూపించండి. TRF యజమానుల్ని చూపించండి. మేము ఆ ఆరోపణను అంగీకరించము, TRFని UN ప్రెస్ రిలీజ్ నుండి తొలగించాల్సి వచ్చింది’’ అని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం, అమెరికా అధికారికంగా టీఆర్ఎఫ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థ((FTO)గా ప్రకటించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విడుదల చేసిన ప్రకటనలో.. టీఆర్ఎఫ్ లష్కరే తోయిబా ప్రతినిధి సంస్థగా అభివర్ణించింది. 2008 ముంబై దాడుల తర్వాత భారత పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా ‘‘పహల్గామ్ దాడి’’ని యూఎస్ అభివర్ణించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com