Pakistan : ఉగ్రదాడిపై స్పందించిన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో పాకిస్థాన్‌కు ఎటువంటి సంబంధం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బుధవారం అన్నారు. పొరుగు దేశంలో అశాంతికి భారతదేశం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అధికార PML-N పార్టీ సీనియర్ నాయకుడు, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సన్నిహితుడు అయిన ఆసిఫ్, జమ్మూ కాశ్మీర్‌లో హింసకు కేంద్రపాలిత ప్రాంతంలోని విప్లవం, స్వదేశీ శక్తులే అంటూ కల్లబొల్లి మాటలు చెప్పారు.
మంగళవారం పహల్గామ్ సమీపంలోని బైసరన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరపడంతో దాదాపు 30 మంది మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను నిందిస్తూ భారతదేశం వైపు నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వ్యాఖ్య వెలువడినప్పటికీ.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ముందుగానే స్పందించడం గమనార్హం. ఆసిఫ్ లైవ్ 92 న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. “ఈ ఉగ్రదాడితో పాకిస్థాన్ కు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా ఆదేశంలో పుట్టిందే. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉద్యామాలు, విప్లవాలు జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. డజన్ల కొద్దీ ఉద్యమాలు జరుగుతున్నాయి. నాగాలాండ్ నుంచి కాశ్మీర్ వరకు, దక్షిణాన ఛత్తీస్‌గఢ్, మణిపూర్ లాంటి ప్రదేశాలన్నింటిలోనూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.” అని ఆయన పేర్కొన్నారు.
“ప్రజలు తమ హక్కులను అడుగుతున్నారు. స్వదేశీ సంస్కృతి, హిందూత్వ శక్తులు ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. మైనారిటీలను అణచివేస్తున్నాయి. క్రైస్తవులు, బౌద్ధులను దోపిడీ చేస్తున్నాయి. వారిని చంపేస్తున్నారు. ఇది దానికి వ్యతిరేకంగా ఒక విప్లవంగా మారింది. అందుకే అక్కడ ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ సంఘటనకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వం.” అని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ దొంగమాటలు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com